/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/A-family-attacked-a-man-in-Khammam-district.webp)
ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. కేవలం తుమ్మాడనే కారణంతో ఓ వ్యక్తిని చితకబాదారు. చింతకాని మండలం పందిళ్లపల్లికి చెందిన బొందెల సత్యనారాయణ కుటుంబం ఈనెల 13న కారులో ఓ శుభకార్యానికి బయలుదేరుతుండగా...అదే వీధిలో ఉన్న పప్పుల వీరభద్రం తన ఇంట్లోనే కూర్చుని తుమ్మాడు. అదే సమయంలో బొందె సత్యనారాయణ కారు వీరభద్రం ఇంటి ముందుకు వచ్చింది. తాము కారులో శుభకార్యానికి వెళ్తుండగా అపశకునంగా తుమ్మాడంటూ వీరభద్రాన్ని సత్యనారాయణ కుటుంబ సభ్యులు అసభ్య పదజాలంతో దారుణంగా దూషించారు.
అంతేకాదు ఈ వ్యవహారంపై గ్రామంలో పంచాయితీ నిర్వహించారు. ఈ సమయంలో సత్యనారాయణ కుటుంబ సభ్యులు వీరభద్రపై మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. వీరిలో దాడిలో వీరభద్ర తీవ్రంగా గాయపడ్డారు. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సత్యనారాయణ కుమారులు, అతని భార్యపై కేసు నమోదు చేశారు. కేవలం తుమ్మాడన్న కారణంతో వ్యక్తిని దారుణంగా చితక్కొట్టిన ఈఘటన ఇప్పుడు ఖమ్మం జిల్లాలో కలకలం రేపింది. అయితే ఈ ఘటనపై నిజనిజాలు తెలుసుకుని తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.