మంచిర్యాల జిల్లాలో అవమానవీయ ఘటన..
ఇటీవల మహారాష్ట్రలో దళిత యువకులను చెట్టుకు వేలాడదీసి తీవ్రంగా కొట్టిన ఘటన గుర్తుందా..? అలాంటి అవమానవీయ ఘటనే తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో జరిగింది. మేకను దొంగతనం చేశాడంటూ ఓ దళిత యువకుడిని తలకిందులుగా వేలాడదీసి చిత్రహింసలకు గురిచేశారు. మందమర్రిలోని యాపల్ ప్రాంతానికి చెందిన రాములు, స్వరూప దంపతులు రైల్వే ట్రాక్ సమీపంలో ఓ షెడ్డు ఏర్పాటు చేసుకుని మేకలను పెంచుకుంటున్నారు. వీరి వద్ద తేజ అనే యువకుడు పశువుల కాపరిగా పనిచేస్తున్నాడు. అయితే ఇటీవల వారు పెంచుకుంటున్న ఓ మేక కనిపించకుండా పోయింది.
తలకిందులుగా వేలాడిదీసి తాళ్లతో కట్టేసి..
ఆ మేకను తేజతో పాటు అతని స్నేహితుడు కిరణ్ అనే దళిత యువకుడు ఎత్తుకెళ్లారని రాములు కుటుంబ సభ్యులు అనుమానించారు. ఆ వెంటనే ఇద్దరిని షెడ్డులోకి తీసుకొచ్చి తలకిందులుగా వేలాడిదీసి తాళ్లతో కట్టేసి తీవ్రంగా కొట్టారు. కింద పొగ కూడా పెట్టి ఊపిరి ఆడకుండా చిత్రహింసలకు గురిచేశారు. ఆ బాధ తట్టుకోలేక వారు ఆర్తనాదాలు పెట్టారు. అనంతరం డబ్బులు ఇస్తామని చెప్పడంతో వారిని విడిచిపెట్టారు.
నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు..
తల్లిదండ్రులు లేని కిరణ్ చిన్నమ్మ సరిత దగ్గర ఉంటూ కూలీ పని చేస్తున్నాడు. అయితే పనికి వెళ్లిన కిరణ్ ఇంటికి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదుచేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో వారిని కట్టేసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో బయటకు రావడంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రాములు కుటుంబ సభ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి.
మహారాష్ట్రలో కూడా ఇలాంటి దారుణ ఘటన..
ఇటీవల ఆగస్టు 25న మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లోని శ్రీరాంపూర్ తాలూకాలోని హరేగావ్ గ్రామంలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. మేకను, కొన్ని పావురాలను దొంగిలించారనే అనుమానంతో.. నలుగురు దళిత వ్యక్తులను ఆరుగురు వ్యక్తులు చెట్టుకు తలకిందులుగా వేలాడదీసి, కర్రలతో కొట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పెద్ద దుమారం రేగింది. ఈ దారుణ ఘటనపై దళిత సంఘాలతో పాటు రాజకీయ పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.
ఇది కూడా చదవండి: ముంబైలో దళితులను చెట్టుకు వేలాడదీసిన కేసులో నిందితులు అరెస్ట్