/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/chines-loan.jpg)
దేశవ్యాప్తంగా చైనీస్ లోన్ యాప్స్ వేధింపులు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. ఏదో ఒక చోట రోజుకు ఎవరో ఒకరు ఈ వేధింపుల ధాటికి బలైపోతున్నారు. తాజాగా బెంగళూరు నగరానికి చెందిన 22 ఏళ్ల యువకుడు ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. జాలహళ్లికి చెందిన తేజ అనే కుర్రాడు యలహంకలోని నిట్టే మీనాక్షి ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు. తేజ తన అవసరాల కోసం 'స్లైస్ అండ్ కిస్' అనే లోన్ యాప్ నుంచి కొంతమేర రుణం తీసుకున్నాడు. అయితే తిరిగి చెల్లించడంలో జాప్యం జరగడంతో ఏజెంట్ల వేధింపులు తీవ్రం అయ్యాయి.
ఫొటోలు లీక్ చేస్తామని బెదిరింపులు..
తక్షణమే రుణం చెల్లించకుంటే ఫోన్ లో ఉన్న వ్యక్తిగత ఫొటోలను బయటపెడతామని బెదిరింపులకు దిగారు. దీంతో ఏం చేయాలో తెలియక తన తండ్రికి జరిగిన విషయం చెప్పాడు. దీంతో తండ్రి గోపినాథ్ తన కుమారుడు తీసుకున్న రుణాన్ని వాయిదాల వారీగా చెల్లించేందుకు అంగీకరించాడు. అయినా కానీ ఏజెంట్లు తేజ ఇంటికి వెళ్లి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డారు.
అప్పు తీరుస్తానన్న వినలేదు..
మూడు రోజుల క్రితం ఇంటికెళ్లిన ఏజెంట్లను అప్పు తీర్చేందుకు కొంత సమయం కావాలని తండ్రి గోపీనాథ్ అభ్యర్థించాడు. అయితే వారు ఒప్పుకోకుండా తక్షణమే డబ్బులు కట్టేయాలని బెదిరించారు. అంతేకాకుండా తేజకు ఫోన్లు మీద ఫోన్లు చేశారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన అతను దారుణ నిర్ణయం తీసుకున్నాడు. ఇంట్లో ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
అమ్మ, నాన్న క్షమించండి..
"నేను చేసిన తప్పులకు అమ్మ, నాన్నకు క్షమాపణలు చెబుతున్నా. చనిపోవడం తప్ప నాకు వేరే మార్గం కనిపించడం లేదు. నా పేరు మీద ఉన్న రుణాలను నేను తిరిగి చెల్లించలేను. ఇదే నా చివరి నిర్ణయం. గుడ్ బై" అంటూ చనిపోయే ముందు సూసైడ్ నోట్ రాశాడు. తమ కుమారుడి ఆత్మహత్యకు కారణమైన లోన్ యాప్స్ ఏజెంట్లుపై కఠిన చర్యలు తీసుకోవాలని పేరెంట్స్ డిమాండ్స్ చేస్తున్నారు.