తెలుగు రాష్ట్రాల్లో గత కొన్నిరోజులుగా చిన్నారుల కిడ్నాప్ ఎక్కువ అయ్యాయి. అయితే, నిన్న తిరుపతి బస్టాండ్‌లో బాలుడు కిడ్నాప్ అయిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువకముందే మరో ఘటన చోటుచేసుకుంది. సోమవారం రాత్రి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌లోని ఫ్లాట్ ఫారం 3 దగ్గర రెండేళ్ల బాలుడిని గుర్తుతెలియని వ్యక్తి ఎత్తుకుపోయాడు. తిరుమల శ్రీవారి దర్శనానంతరం తిరుగు ప్రయాణం కోసం తిరుపతి బస్టాండ్‌లోని చెన్నై ఫ్లాట్ ఫామ్ దగ్గర ఈ ఘటన జరిగింది. పోలీసులు ఎంతో చాకచక్యంతో 7 గంటల్లోనే బాబుని తల్లిదండ్రులు వద్దకు చేర్చారు. అంతా హాయిగా ఉంది అనుకునే లోపే మరో ఘటన కలకలం రేపింది.
గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో ఎనిమిది రోజుల చిన్నారి కిడ్నాప్ గురైన విషయం తెలిసిందే. కిదాంబినగర్‌కు చెందిన రోషిణి గత నెల 26న డెలివరీ కోసం ఆస్పత్రిలో చేరింది. అదే రోజు ఆడబిడ్డకు జన్మనిచ్చింది. చిన్నారి బరువు తక్కువగా ఉండటంతో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. మధ్యాహ్నం సమయంలో చిన్నారితో నిద్రిస్తున్న సమయంలో గుర్తుతెలియని మహిళ ఎనిమిది రోజుల చిన్నారిని అపహరించింది. నిద్రలేచిన రోషిణికి కూతురు కనిపించకపోవడంతో సెక్యూరిటీ సిబ్బందికి ఫిర్యాదు చేసింది. దీంతో సిబ్బంది చిన్నారి కిడ్నాపైన విషయాన్ని ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చింది. వార్డులో సీసీ ఫుటేజ్ పరిశీలించారు. గుర్తుతెలియని మహిళ చిన్నారిని తీసుకు వెళ్లడం గుర్తించారు. కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
సిబ్బంది నిర్లక్ష్యంతోనే..
అయితే .. ఈ కిడ్నాప్‌పై సెక్యూరిటీ సిబ్బందిని వివరణ అడగగా.. ఎవరు తీసుకెళ్లలేదని చెబుతున్నారు. సీపీ ఫుటేజ్ చెక్ చేయగానే 3 గంటలకు తీసుకెళ్లినట్టు రికార్డు అయిందని పాప తండ్రి తెలిపారు. ఇదంతా ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందని చిన్నారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా ఈ ఆస్పత్రిలో చిన్నారులు కిడ్నాప్‌కు గురైన ఘటనలు ఉన్నాయి. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతునే ఉంది. సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పినప్పటికీ .. మళ్లీ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనపై సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు నరసరావుపేట ఉప్పలపాడు వద్ద చిన్నారి ఉన్నట్లు కొత్తపేట పోలీసులు గుర్తించారు. చిన్నారితో పాటు కిడ్నాప్ చేసిన మహిళను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. చిన్నారిని తల్లి రోషిణికి క్షేమంగా అప్పగించారు.