Corona JN1 : ఆదివారం వరకూ దేశవ్యాప్తంగా కొవిడ్-19(Covid-19) సబ్ వేరియంట్ జేఎన్(JN1) కేసులు మొత్తం 63 నమోదైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. వాటిలో సగానికి పైగా, అంటే 34 కేసులు గోవాలోనే వెలుగుచూశాయని ఆరోగ్యశాఖ అధికారులు చెప్పారు. మహారాష్ట్రలో తొమ్మిది, కర్ణాటకలో ఎనిమిది, కేరళలో ఆరు, తమిళనాడులో నాలుగు, తెలంగాణలో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని సంబంధిత వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Jagtial : సగం ధరకే బంగారం!.. వాట్సాప్‌లో కొత్త దందా
జేఎన్ 1 కొత్త వేరియంట్ కొవిడ్-19 కేసులను భారత వైద్యాధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారని, దాన్ని అతి త్వరలోనే అదుపులోకి తెస్తారని నీతి ఆయోగ్ (ఆరోగ్య) సభ్యుడు డాక్టర్ వీకే పాల్(VK Pal) తెలిపారు. కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం కావాలని కేంద్రం సూచించింది. దీనికోసం నిఘా వ్యవస్థలను కూడా బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పింది. అయితే, పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్యను చూసి ఆందోళన చెందనవసరం లేదని, ఇప్పటికిప్పుడు దీని వల్ల కలిగే నష్టమేమీ లేదని అన్నారు. కోవిడ్-19 పాజిటివ్ కేసుల్లో 92 శాతం వరకూ ఇంటి వద్దే ఉండి చికిత్స పొందుతూ కోలుకుంటున్నారని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి.