/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/ganesh-jpg.webp)
Khairatabad Ganesh 2023: వినాయక చవితి వస్తుందంటే చాలు..తెలుగు రాష్ట్ర ప్రజలందరి దృష్టి ఖైరతాబాద్ గణేషుడిపైనే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఖైరతాబాద్ మహా గణపతి విగ్రహం.. ఈ ఏడాది 63 అడుగుల్లో శ్రీ దశమహా విద్యాగణపతిగా రూపుదిద్దుకోనుంది. ఏడాదికోరూపంలో దర్శనమిచ్చే గణనాథుడు ఈ సంవత్సరం శ్రీ దశమహా విద్యాగణపతి రూపంలో కొలువుతీరనున్నాడు.
శ్రీ దశమహా విద్యాగణపతి:
విఘ్నాధిపతిగా తొలిపూజ అందుకునే గణపయ్యను వాడవాడలా ఘనంగా పూజించే వేడుక దగ్గరకొచ్చేస్తోంది. గతేడాది 50 అడుగుల ఎత్తులో దర్శనమిచ్చిన ఖైరతాబాద్ మహా గణపతి విగ్రహం ఈ ఏడాది 63 అడుగుల్లో రూపుదిద్దుకోనుంది. శ్రీ దశమహా విద్యాగణపతి భక్తులను అనుగ్రహించనున్నాడు పార్వతీ తనయుడు. విగ్రహం ఎత్తు 63 అడుగులు, వెడల్పు 28 అడుగులుగా ఉండనుంది. నిల్చున్న తీరులో 'శ్రీ దశమహా విద్యాగణపతి' విగ్రహం ఉండగా.. తలపై ఏడు సర్పాలు ఉండనున్నాయి. వెనక సంస్కృతంలో రాసిన గ్రంథం కనిపిస్తుంది. పది చేతులు ఉంటాయి. కుడి వైపు చేతుల్లో కింద నుంచి పైకి ఆశీర్వాదం, దండ, ధాన్యం, తల్వార్, బాణం ఉంచుతారు. ఎడమవైపు కింద నుంచి పైకి చేతిలో లడ్డూ, గ్రంథం, తాడు, అంకుశం, బాణం ఉంటాయి. కాళ్ల వద్ద అటూ ఇటూ పది అడుగుల ఎత్తున వరాహదేవి, సరస్వతీ దేవి విగ్రహాలు ఉంటాయి. ప్రధాన మండపం రెండు వైపులా శ్రీ పంచముఖ లక్ష్మీ నారసింహస్వామి, శ్రీ వీరభద్ర స్వామి వార్ల విగ్రహాలు దాదాపు 15 అడుగుల ఎత్తులో రూపుదిద్దుకుంటాయి. ఇప్పటికే విగ్రహం తయారీ పనులు 90 శాతానికి పైగా పూర్తయ్యాయి. చవితి పండుగకు మూడు రోజుల ముందే భక్తులు విగ్రహాన్ని చూడొచ్చని నిర్వాహకులు తెలిపారు. పర్యావరణ హితం కోసం మట్టి గణపతినే ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు నిర్వాహకులు.
Also Read : శ్రీవారి ఆలయంలో ఆగమోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం