యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హథ్రాస్ జిల్లా సదాబాద్ రోడ్డులో ట్రాక్టర్-ట్రక్కు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు మరణించారు. యాక్సిడెంట్ సమయంలో ట్రాలీలో 45 మంది భక్తులు ఉన్నట్టు జిల్లా ఎస్పీ దేవాన్ష్ కుమార్ పాండే తెలిపారు.
ఎటా జిల్లా జలేసర్ నుంచి మధురాలోని గోవర్దన్ కు వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకున్నట్టు వివరించారు. ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించినట్టు తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మృతి చెందినట్టు చెప్పారు.
మృతులను విక్రమ్ (45), మాధురి (22), హేమలత(12), లక్ష్మీ (18), అభిషేక్ (20), విష్ణు (20)గా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను సదాబాద్ లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తరలించారు. మరి కొందరని అలీఘర్ మెడికల్ కళాశాలలో చేర్చారు. మృత దేహాలకు పోస్టు మార్టమ్ నిర్వహిస్తున్నామన్నారు.
ట్రక్కు డ్రైవర్ తో పాటు క్లీనర్ ను అరెస్టు చేశామన్నారు. ట్రక్కును సీజ్ చేశామన్నారు. ఈ ఘటనపై యూపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు.