Cyclone Effect : అప్పటివరకు అంతా నిశ్శబ్దం.. ఇంతలోనే మొత్తం అతలాకుతలం..! బిక్కుబిక్కుమంటూ కూర్చున్న ఓ వ్యక్తి అమాంతం గాల్లోకి ఎగిరాడు.. బలమైన ఈదురుగాలులకు చెట్లు నేలకొరుగుతున్నాయి. ప్రకృతి కన్నేర చేస్తే జరిగే విధ్వంసం ఊహకందనిది. ముఖ్యంగా తుపాన్లు (Storms) విరుచుకుపడినప్పుడు జరిగే ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఎంతో విషాదభరితమైనది! ప్రపంచంలో అత్యంత తీవ్రమైన తుపానులన్నీ బంగాళాఖాతంలోనే సంభవిస్తాయట.. రెమాల్ తుపానైనా (Remal Toofan).. మరో తుపానైనా దానికి బంగాళాఖాతమే కేరాఫ్..! ప్రపంచంలో ఇప్పటివరకు సంభవించిన ఐదు అత్యంత ఘోరమైన తుఫాన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం!
1. సైక్లోన్ (Cyclone) భోలా..1970 నవంబర్‌లో వచ్చిన ఈ తుపాన్.. అత్యంత ఘోరమైన వాటిల్లో ఒకటి. బంగాళాఖాతంలో సంభవించిన ఈ తుపాను దెబ్బకు ఇంచుమించుగా 50 లక్షల మంది తమ ప్రాణాలు కోల్పోయినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఈ తుపాను సమయంలో తీర ప్రాంతంలో అలలు దాదాపు 34 అడుగుల ఎత్తున ఎగసిపడ్డాయంటే దీని తీవ్రత ఎలా ఉందే అర్థం చేసుకోవచ్చు. ఈ తుపాను సమయంలో బంగ్లాదేశ్ చిట్టగాంగ్ సమీపంలోని 13 దీవుల్లో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని పాకిస్తాన్ రేడియో వెల్లడించింది. 36 లక్షలకు పైగా ప్రజలు ఈ తుపాను వల్ల ప్రత్యక్షంగా ప్రభావితమైనట్లు సమాచారం.
2. 2008 మే 2న నర్గీస్ తుపాను మియన్మార్‌ను ఊడ్చిపడేసింది. బర్మా తీరంలో సంభవించిన నర్గీస్ తుపాను కారణంగా సుమారు లక్ష 40 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. 20 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 53,800 మంది గల్లంతయ్యారు. నర్గీస్ తీరం దాటే సమయంలో గంటకు 215 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. దీని కారణంగా వేలాది భవనాలు ధ్వంసమయ్యాయి. లబుటా పట్టణంలో 75 శాతం భవనాలు కూలిపోయాయి. 20 శాతం పైకప్పులు పగిలిపోయాయి.
3. 1991 ఏప్రిల్ 29న బంగ్లాదేశ్ చిట్టగాంగ్ ఆగ్నేయ తీర ప్రాంతాన్ని బలమైన తుపాను తాకింది. ఈ తుపాను బంగ్లాదేశ్‌ను అతలాకుతలం చేసింది. లక్షా 35 వేల మందికి పైగా ప్రజలు మరణించారు. కోట్ల మంది నిరాశ్రయులయ్యారు. అంతేకాకుండా తుపాను కారణంగా పది లక్షల ఆవులు చనిపోయాయి. ఈ తుపాను కారణంగా చిట్టగాంగ్ జిల్లాలో గంటకు 250 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. దీని కారణంగా చిట్టగాంగ్‌లో బంగ్లాదేశ్ నేవీ, బంగ్లాదేశ్ వైమానిక దళం ఉన్న స్థావరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నౌకలకు భారీ నష్టం వాటిల్లింది. వైమానిక దళానికి చెందిన చాలా యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. పలు ప్రాంతాల్లో 90 శాతం వరకు పంటలు కొట్టుకుపోయాయి.
4. 1922 ఆగస్టు 29న చైనాలో సంభవించిన తుపానుకు లక్ష మంది వరకు మరణించారని అంచనా. ఈ తుపాను వల్ల షాంటౌ ప్రావిన్స్‌లో భారీగా వరదలు సంభవించాయి. అనేక భవనాలు నేలకోలాయి. పంటలు నాశనం అయ్యాయి.
5. 1942 అక్టోబరు 16న బెంగాల్ తీరాన్ని ప్రాంతాన్ని తాకిన వినాశకరమైన ఉష్ణమండల తుపాను తాకింది. ఈ తుపాను కారణంగా 61,000 మంది మరణించారని అంచనా. ఈ తుపాను తీర ప్రాంతాలను, ముఖ్యంగా కలకత్తా నగరం, దాని పరిసర ప్రాంతాలను ముంచెత్తింది. ఇది రెండో ప్రపంచ యుద్ధంలో మిత్రదేశాల యుద్ధ ప్రయత్నాలపైనా నెగిటివ్ ఎఫెక్ట్ చూపింది.
Also Read : ప్రైవేట్ పార్ట్ పై అనసూయ టాటూ.. దాని అర్థం అదేనా?