/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/fire-accident.jpg)
తెలుగు రాష్ట్రాల్లో వరుస అగ్నిప్రమాదాలు జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. సాహితీ ఫార్మాలో పేలుడు ఘటన, శంషాబాద్ ఆటోమొబైల్ షాపులో మంటలు, విశాఖ తూర్పునౌకాదళం ప్రధాన కార్యాలయ ఆవరణలో అగ్నిప్రమాద ఘటనలు మరవకముందే రంగారెడ్డి జిల్లా మైలార్ దేవపల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ ప్లాస్టిక్ గోడౌన్‌లో మంటలు చెలరేగడంతో అగ్నికిలలు ఎగిసిపడ్డాయి. పక్కనే ఉన్న మరో గోదాంకు అగ్నికిలలు వ్యాపించాయి. సమాచారం అందిన వెంటనే హుటాహుటిన పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మంటలకు తోడు దట్టమైన పొగ అలముకోవడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరియ్యారు. చుట్టుపక్కన ఇళ్లలో ఉంటున్న వాళ్లు బయటకు పరుగులు తీశారు. అటు ప్లాస్టిక్ పరిశ్రమలో కార్మికులు ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందనే చెప్పాలి. షాట్ సర్క్యూట్‌తోనే అగ్నిప్రమాదం సంభవించినట్టు అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు.
సాహితీ ఫార్మాలో పేలుడు ఘటనలో నాలుగుకి చేరిన మృతుల సంఖ్య:
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలిలోని సాహితీ ఫార్మా కంపెనీలో గత నెల (జూన్) 30వ తేదీన భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, మృతి చెందినవారి సంఖ్య నాలుగుకు చేరుకుంది. ఈ దుర్ఘటనలో అదే రోజు ఇద్దరు మృతి చెందగా.. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని అధికారులు.. విశాఖపట్నం జిల్లాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న వారిలో అప్పారావు అనే కార్మికుడు ఆదివారం రాత్రి మృతి చెందగా.. నిన్న(జులై 3) ఉదయం బి. రామేశ్వర్ అనే కార్మికుడు చనిపోయాడు. మరోవైపు ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి.. చనిపోయిన కార్మికులకు రూ.25 లక్షల నష్టపరిహారం ఇస్తామని ప్రకటించింది. కానీ, ఈ ఘటన జరిగి మూడు రోజులు కావస్తున్నా ఫ్యాక్టరీ యాజమాన్యం మాత్రం ఇప్పటివరకూ ఎటువంటి పరిహారం ప్రకటించలేదు. దీంతో మృతుల కుటుంబ సభ్యులు ఫ్యాక్టరీ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మృతి చెందిన కార్మికుల పట్ల యాజమాన్యం బాధ్యత తీసుకోకుండా నిర్లక్ష్యం వహించడం ఏమిటి..? అని ప్రశ్నిస్తున్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యం పరిహారం ప్రకటిస్తేనే.. రెండు మృతదేహాలను పోస్ట్‌మార్టానికి తీసుకెళ్లనిస్తామని ఆందోళన చేపట్టారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/fire-accident.jpg)
నేవీ ప్రధాన కార్యాలయం ఆవరణలో అగ్నిప్రమాదం:
విశాఖ తూర్పునౌకాదళం ప్రధాన కార్యాలయ ఆవరణలో నిన్న(జులై 3) అగ్నిప్రమాదం జరిగింది. నావెల్ అధికారి క్లోజ్డ్ గదిలో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అద్దాలు పగలగొట్టి మంటలు ఆర్పివేశారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
శంషాబాద్‌లో అగ్నిప్రమాదం:
హైదరాబాద్ -శంషాబాద్‌లోని ఓ ఆటోమొబైల్ షాపులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. స్థానిక తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఉన్న దుకాణంలో ఈ ఘటన జరిగింది. అదృష్టవశాత్తూ.. ఘటన సమయంలో దుకాణం మూసివేయడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని రెండు అగ్నిమాపక వాహనాలతో మంటలను ఆర్పారు. షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగి ఉండవచ్చని భావిస్తున్నారు.