TS News : నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ లోని హిల్ కాలనీలో విషాదం నెలకొంది. మంచినీళ్ల ట్యాంకులో పడి 30కోతులు మరణించాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..విజయ విహార్ సమీపంలోని 200ఇళ్లకు మంచినీరు సరఫరా చేసేందుకు ఓ ట్యాంకు నిర్మించారు. దానిపైన రేకులు వేశారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ట్యాంకులో నీళ్లు తాగేందుకు ప్రయత్నించాయి కోతులు. ఈ క్రమంలోనే ట్యాంకులోకి దిగిన కోతులు బయటకు వచ్చే దారి దొరక్క అందులోనే మరణించాయి. బుధవారం అధికారులు గుర్తించి దాదాపు 30 కోతుల కళేబరాలను వెలికితీశారు.
వాటర్ ట్యాంకులో కోతులు మరణించిన విషయం తెలుసుకున్న స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. కోతులు చనిపోయి దాదాపు 15రోజులు పై నే అయింటుందంటున్నారు. అప్పటి నుంచి ఆ నీటినే తాగుతున్నామని ఆందోళన చెందుతున్నారు. కోతులు మరణించిన నీరు తాగమని..తాము అనారోగ్యం బారిన పడతామని భయపడుతున్నారు. కాలనీలోని ఇళ్లకు నీటిని సరఫరా చేసే ట్యాంకులను ప్రతి 6 నెలలకు ఒకసారి శుభ్రం చేయాలని అధికారులు చెప్పినా ఏనాడూ శుభ్రం చేయలేదని ఆరోపిస్తున్నారు. నిర్లక్ష్యం వహించిన నీటి సరఫరా విభాగం అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: బావి తవ్వుతుండగా ప్రమాదం..మట్టిలో కూరుకుపోయిన ఇద్దరు వ్యక్తులు..!