ఉత్తర ఆఫ్రికాలోని మొరాకోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అజీలాల్ లోని మధ్య ప్రావిన్సులో మినీ బస్సు ఒకటి బోల్తా పడింది. ఈ ఘటనలో 24 మంది మరణించారు. డిమ్నేట్ నగరంలోని వీక్లీ మార్కెట్ కు ప్రయాణికులతో వెళ్తుండగా బస్సు బోల్తా పడినట్టు అధికారులు తెలిపారు.
సమచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మొరాకోతో పాటు ఉత్తర ఆఫ్రికాలోని ఇతర దేశాల్లో తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ ఏడాది మార్చిలోనూ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
మొరాకోలో వ్యవసాయ కూలీలతో వెళ్తున్న బస్సు ఒకటి చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో మొత్తం 11 మంది వ్యవసాయ కూలీలు మరణించారు. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతోనే ఈ ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు.
గతేడాది మొరాకోలని కాసాబ్లాంకాలో బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 23 మంది మృతి చెందారు. మరో 30 మందికి పైగా గాయాల పాలయ్యారు. మొరాకోలో ఏడాదికి సగటున 3500 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని మొరాకో నేషనల్ రోడ్ సేఫ్టీ ఏజెన్సీ తన నివేదికలో వెల్లడించింది. సగటున రోజుకు 10 మంది ప్రాణాలు కోల్పోతున్నారని, 12000 మందికి గాయాలవుతున్నట్టు వెల్లడించింది.