పాకిస్తాన్‌లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. సర్హరి రైల్వే స్టేషన్ సమీపంలో హజారా ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. కరాచి నుంచి రావల్పిండి వెళుతుండగా ప్రమాదం సింధు ప్రావిన్స్ ప్రాతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం 15 మంది మరణించారు.
మరో 50 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. రైలు పట్టాలు తప్పడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని చెప్పారు.
యాక్సిడెంట్ వల్ల ఆ ట్రాక్ పై రైళ్ల ప్రయాణాలను రద్దు చేసినట్టు పేర్కొన్నారు. ప్రమాద స్థలం నుంచి ప్రయాణికులను తరలించేందుకు మరో రైలును పంపినట్టు వివరించారు. సుకూర్ డివిజినల్ కమర్షియల్ ఆఫీసర్ మొహసీన్ సియా మాట్లాడుతూ.... రైల్లో ఎన్ని బోగీలు పట్టాలు తప్పాయనే విషయంపై స్పష్టత లేదన్నారు.
కొందరు ప్రయాణికులు ఐదు కోచ్ లు పట్టాలు తప్పాయని చెబుతున్నారని, మరి కొందరు ఎనిమది కోచ్ లు పట్టాలు తప్పాయని, ఇంకొందరు పది కోచ్ లు పట్టాలు తప్పాయని చెబుతున్నారని పేర్కొన్నారు. తాను ప్రస్తుతం ప్రమాద స్థలానికి వెళ్తున్నట్టు చెప్పారు.