Ayodhya Ram Mandir : అయోధ్య రాముడికి 1,265 కిలోల భారీ హైదరాబాద్ లడ్డు

అయోధ్యలో జనవరి 22న ఆలయ ప్రాణప్రతిష్టకు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ చెందిన శ్రీరామ్ కేటరర్స్ వారు అయోధ్య రాముడికి 1265 కిలోల భారీ లడ్డూను నైవేద్యంగా సమర్పించే అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకున్నారు.

New Update
Ayodhya Ram Mandir : అయోధ్య రాముడికి 1,265 కిలోల భారీ హైదరాబాద్ లడ్డు

1265 Kg Laddu For Ram Mandir: జనవరి 22న అంగరంగవైభవంగా అతిరథ మహారథులసమక్షంలో అయోధ్య రామమందిర (Ayodhya Ram Mandir) ప్రారంభోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీతో పాటు, దేశవ్యాప్తంగా 7వేల మంది ప్రత్యేక అతిథులు, లక్షలాదిగా ప్రజలు పాల్గొననున్నారు.

ఈ క్రమంలో అయోధ్య రామయ్యకు ఏ చిన్న పని చేసినా తమ జన్మ ధన్యమైపోయిందని భావిస్తున్న తరుణంలో.. హైదరాబాద్ (Hyderabad) కు చెందిన కేటరర్స్ కు మాత్రం అరుదైన అవకాశం దక్కింది. ఏకంగా అయోధ్య రామయ్యకు నైవేధ్యం చేసి పెట్టే అవకాశాన్ని దక్కించుకున్నారు. ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా రామయ్యకు నైవేధ్యంగా లడ్డు తయారు చేసే అవకాశాన్ని సికింద్రాబాద్ కంటోన్ మెంట్ లోని శ్రీరామ్ కేటరర్స్ కు కల్పించారు. అందుకు సంబంధించిన అనుమతులను లేఖ రూపంలో శ్రీరామ్ కేటరర్స్ కు పంపారు. శ్రీరామ క్యాటరింగ్ సర్వీసెస్ యజమాని నాగభూషణం రెడ్డి, కృష్ణకుమారిలు రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా 1,265 కిలోల భారీ లడ్డూను ప్రత్యేకంగా సిద్ధం చేశారు.

Also Read: రెండు బొమ్మలను టెంట్‌ లోపల ఉంచి రాముడంటున్నారు..కర్నాటక మంత్రి వివాదస్పద వ్యాఖ్యలు!

రామాలయం భూమిపూజ నుంచి ప్రాణప్రతిష్ట వరకు ఎన్నిరోజులయితే అన్ని రోజులకు రోజుకు ఒక కిలో చొప్పున భారీ లడ్డు తయారు చేయాలని శ్రీరామ్ కేటరర్స్ యజమానులు మొక్కుకున్నారు. అలా 1,265 రోజులకు గాను 1,265 కిలోల లడ్డూ తయారు చేయాలనుకున్నారు. అదే విషయాన్ని శ్రీరామ తీర్థ ట్రస్టుకు తెలియజేశారు. పది రోజుల క్రితం ట్రస్టు నుంచి శ్రీరామ్ కేటరర్స్ కు అనుమతులు ఇస్తూ లేఖను పంపారు. వెంటనే శ్రీరామ్ కేటరర్స్ లడ్డూని తయారు చేశారు. మొత్తం 1265 కిలోల భారీ లడ్డూను తయారు చేశారు. ఈ లడ్డూ తయారీకి 350 కిలోల శనగపిండి, 700 కిలోల చక్కెర, 40 కిలోల నెయ్యి, 40 కిలోల కాజు, 30 కిలోల కిస్మిస్, 15 కిలోల బాదం, 10 కిలోల పిస్తా, 32 గ్రాముల కుంకుమ పువ్వును వినియోగించినట్లు శ్రీరామ్ కేటరర్స్ యజమాని నాగభూషణం రెడ్డి వెల్లడించారు. ఈ లడ్డుకు ఏసీ ఫిక్స్ చేసి అయోధ్యకు రోడ్డు మార్గం ద్వారా పంపుతారు.

ఈ భారీ లడ్డుకు తోడు మరో 5 చిన్న లడ్డూలను కూడా వీరు తయారు చేస్తున్నారు. వాటిని పూజా సామాగ్రితో పాటుగా అయోధ్య రామయ్యకు నైవేధ్యంగా సమర్పించనున్నారు. ఈ భారీ లడ్డూను అయోధ్య రామ మందిరానికి కేవలం 50 మీటర్ల దూరంలో ప్రదర్శనకు ఉంచుతారని చెప్పారు. అక్కడికి వచ్చే భక్తులకు ఈ లడ్డూను ప్రసాదంగా వితరణ చేయనున్నారు. జనవరి 21న ఈ భారీ లడ్డు అయోధ్యకు చేరుకుంటుందని తెలియజేశారు. ఇప్పటికే అయోధ్య రామమందిరానికి హైదరాబాద్ నుంచి తలుపులు, పాదుకలు తయారై వెళ్లిన విషయం తెలిసిందే. ఇప్పుడు నైవేధ్యం రూపంలో కూడా భాగ్యనగరం భాగం కావడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు