క్రీడా రంగంలోకి రెండేళ్ల క్రితమే...అడుగుపెట్టిన రాంబాయ్ బామ్మ పేరు మీద 100 మీ. స్ప్రింట్‌లో పాల్గొన్న అత్యంత వయసున్న మహిళగా ఇప్పటికే ప్రపంచ రికార్డు సంపాదించింది. పోటీలు అయిపోయిన తర్వాత మనవరాలు తన కాలును మసాజ్ చేయడానికి రాగా.. ‘నేను బాగానే ఉన్నాను. అవసరమైన వాళ్లకు సాయం చేయి’అని చెప్పడం ఇంకో విశేషం. హర్యానాలోని మారుమూల గ్రామంలో జన్మించిన రాంబాయ్ జీవితం చాలావరకు పొలం పనులు, ఇంటి పనుల్లోనే గడిచిపోయింది. అయితే 2016లో వచ్చిన ఒక వార్త ఆవిడను ఆటల్లోకి వచ్చేలా చేసింది. పంజాబ్‌కు చెందని మాన్ కౌర్ అనే మహిళ 100 ఏళ్ల వయసులో అమెరికన్ మాస్టర్స్ పరుగు పోటీలో గెలుపొందారన్న వార్త అది.
ఆవిడ తొలిసారి 1 నిమిషం 21 సెకన్లలో స్ప్రింట్‌ను పూర్తి చేయగా.. రెండో ఏడాది ఏడు సెకన్ల ముందే స్ప్రింట్‌ను పూర్తి చేసేశారని తెలుసుకుంది. ‘నీ వయసులోనే ఉన్న మహిళ అలా సాధిస్తున్నపుడు నువ్వూ చేయగలవు కదా’ అని 41 ఏళ్ల మనవరాలు షర్మిలా సగ్వాన్ అనడంతో రాంబాయ్ ఈ పోటీల్లో పాల్గొనడం ప్రారంభించింది. ‘నా మనవరాలు చెప్పగానే కాస్త సందేహించాను. ఎప్పుడూ ఊరు దాటి బయటకు వచ్చిన దాన్ని కాదు. ఇప్పుడు పోటీల కోసం వివిధ ప్రదేశాలు తిరుగుతుంటే చాలా బాగుంది. ఈ వయసులో నేను ఇంత బాగా ఆడుతున్నానంటే వయసులో ఉన్నవాళ్లు ఇంకా ఎంత బాగా ఆడతారో.. అందుకే వారంతా క్రీడల్లోకి రావాలి’అని రాంబాయ్ వ్యాఖ్యానించింది.
చిన్నప్పటి నుంచి పొలంలో పని చేయడం. ఇంటి పాలు, కూరగాయలు తీసుకోవడమే తన ఫిట్‌నెస్‌కు కారణమని చెబుతోంది ఈ బామ్మ. మొత్తం దేశ, విదేశాల్లో ఇప్పటి వరకు 14 టోర్నమెంట్లలో పాల్గొనగా వివిధ ఆటల్లో పాల్గొని సుమారు 200 మెడల్స్ సాధించింది. ఈ స్ఫూర్తితో రాంబాయ్ కుమార్తె కూడా క్రీడా పోటీల్లో పాల్గొంటున్నారు. దేశంలో ఎక్కడ పోటీలు జరిగినా ఈ మూడు తరాల మహిళలు వెళ్లి పతకాలు సాధిస్తున్నారు. 41.50 సెకన్లలో స్ప్రింట్‌ను పూర్తి చేసి ఎవరిని చూసి రాంబాయ్ బామ్మ క్రీడల్లోకి వచ్చిందో ఆ మాన్ కౌర్ రికార్డును గతేడాది బ్రేక్ చేయడం కొసమెరుపు అనే చెప్పాలి.