కార్పొరేట్ల ప్రవేశంతోనే మీడియా స్వతంత్రం మంటగలిసిపోయి పెడధోరణలకు దారి తీస్తోందని వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తెలిపారు. ప్రజాస్వామ్యం నాలుగో స్తంభం అయిన పత్రికా రంగం అత్యున్నత నైతిక ప్రమాణాలను పాటిస్తూ ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్నారు. పత్రికలు, సంచికల రిజిస్టేషన్ బిల్లుపై గురువారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కానీ ఇటీవల కాలంలో పత్రికా రంగం తన బాధ్యతలు, ప్రమాణాలను విస్మరిస్తూ అవాంఛనీయమైన ధోరణులకు పాల్పడుతున్న సంఘటనలు అనేకం చూస్తున్నామని పేర్కొన్నారు. చట్టప్రకారం శాసన, న్యాయ, కార్యనిర్వాహక విభాగాల్లో కార్పొరేట్ సంస్థలకు ప్రవేశం నిషిద్ధమని గుర్తుచేశారు. కానీ పత్రికా రంగంలోకి వాటికి ప్రవేశం సులువైందన్నారు. దీని పర్యవసానంగా మీడియా రంగంలోకి ప్రవేశిస్తున్న కార్పొరేట్లు ప్రజాస్వామ్యానికి మూలస్థంభాలైన ఇతర వ్యవస్థలను శాసించే స్థితికి చేరుకున్నాయని వివరించారు.
కొన్ని కుల సంఘాలు, మత సంస్థలు, రాజకీయ స్వప్రయోజనాలు ఆశించే కొన్ని సంస్థలు మీడియా రంగంలోకి ప్రవేశించి విచ్చలవిడిగా ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తూ పత్రికా స్వతంత్రానికే ముప్పు తెచ్చిపెడుతున్నాయన్నారు. కార్పొరేట్ సంస్థలు మీడియా రంగంలో ప్రవేశించడాన్ని తాను వ్యతిరేకించడం లేదన్నారు. అయితే లాభాపేక్ష లేకుండా పత్రికలు నడిపే సంస్థలకు మాత్రమే మీడియాలో ప్రవేశం కల్పించేలా చట్టంలో నిబంధనలను సవరించాలని విజ్ఞప్తి చేశారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం 2020లో 1,527 ఫేక్ న్యూస్ కేసులు నమోదయ్యాయని.. 2019తో పోల్చుకుంటే 214 శాతం పెరిగాయని ఈ సందర్భంగా సభ దృష్టికి తీసుకువెళ్లారు.
ఇండియన్ పీనల్ కోడ్(IPC) ప్రకారం ప్రజలను మభ్యపెట్టి మోసపుచ్చే ప్రకటనలు చేసే వ్యక్తులు శిక్షార్హులని.. కానీ పత్రికల ద్వారా ఫేక్ న్యూస్ వ్యాప్తి చేసే వారికి ఎలాంటి శిక్ష విధించాలో ఈ నిబంధనలు స్పష్టం చేయడం లేదన్నారు. దేశంలో డిజిటల్ మార్కెట్ పెరుగుతున్నందున డిజిటల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను ప్రెస్ కౌన్సిల్ చట్టం పరిధిలోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. భారత పత్రికా రంగానికి వాచ్‌డాగ్‌లా వ్యవహరించే ప్రెస్ కౌన్సిల్‌కు ఇకపై డిజిటల్ న్యూస్‌ను నియంత్రించే అధికారం కట్టబెట్టాలని ఆయన సూచించారు. అన్ని రకాల డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫామ్‌లను నియంత్రిస్తూ ఫేక్ న్యూస్ ప్రచారం చేసే సంస్థలపై భారీగా జరిమానాలు విధించేలా చట్ట సవరణ చేపట్టాలని కోరారు. ఇందుకోసం ఇప్పటికే ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టినట్లు విజయసాయిరెడ్డి వెల్లడించారు.
అలాగే డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు 2023ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడాన్ని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది వ్యక్తిగత గోప్యతతో పాటు సమాచార హక్కును ఉల్లంఘిస్తుందన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛను హరించే విధంగా ఉంటుందని ఒవైసీ తెలిపారు.