IND vs AUS WC Final 2023: యాధృచ్ఛికమే కావచ్చు! తలపండిన క్రీడా విశ్లేషకుల అంచనాలు తప్పినా, క్రికెట్ లో సెంటిమెంట్లు మాత్రం చాలాసార్లు వర్కవుట్ అవుతుంటాయి. ఇక క్రికెట్ ను మతంగా భావించే భారత్ లో ఆ సెంటిమెంట్లకు బలం మరింత ఎక్కువే. అంచనాలని చెప్పలేం, విశ్లేషణలని అసలే అనలేం.. అవి జస్ట్ సెంటిమెంట్స్, అంతకన్నా ఎక్కువగా ఎమోషన్స్! అంతే! వీటి గోల ఇప్పుడెందుకంటే.. అందరికీ తెలిసిందే అయినా, మరోసారి చెప్పుకుందాం.
నంబర్ వన్ జట్టే నెగ్గుతుందా?!
టీమిండియా ఇప్పుడు ఐసీసీ ర్యాంకింగ్స్ లో నంబర్ వన్ గా ఉంది. గత రెండు ప్రపంచ కప్పుల్లోనూ టాప్ టీంలే కప్పును ఎగరేసుకుపోయాయి. 2015లో ఆస్ట్రేలియా, 2019లో ఇంగ్లాండ్ నంబర్ వన్ హోదాలోనే పోటీకి దిగి ట్రోఫీ నెగ్గాయి. ఇప్పుడూ అదే సెంటిమెంట్ టీమిండియాకు కలిసొస్తుందని ఫ్యాన్స్ ఎన్నో ఆశలతో ఉన్నారు.
ఆతిథ్య జట్టే వరల్డ్ కప్ గెలుస్తుందా?!
2011 వరల్డ్ కప్ గుర్తుంది కదా! ధోనీ, గంభీర్ వీరోచిత పోరాటం; భారత్ చారిత్రక విజయం క్రికెట్ ఫ్యాన్స్ కళ్ల ముందు ఇంకా కదలాడుతూనే ఉంటాయి. అప్పుడు వరల్డ్ కప్ జరిగింది మనదేశంలోనే. 2015లో ఆస్ట్రేలియా, 2019లో ఇంగ్లండ్‌లో వరల్డ్ కప్ జరగ్గా ఆ దేశాలే కప్ కైవసం చేసుకున్నాయి. 2019 ఫైనల్ ఎంతలా నరాలను తెంచేసిందో చూశాం కదా. అంతటి ఉత్కంఠలోనూ ఆతిథ్య జట్టే గెలుపొందడం సెంటిమెంట్ కాక మరేమిటని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు 12 ఏళ్లకు మళ్లీ భారత్ లోనే జరుగుతున్న ప్రపంచ కప్ లో అదే సెంటిమెంట్ రిపీట్ కావడం ఖాయమంటున్నారు అభిమానులు.
ప్రతీకార మంత్రం పనిచేస్తుందా?!
2019 వరల్డ్ కప్ లో టీమిండియా ఫైనల్ మ్యాచ్ కు ముందు బోల్తాకొట్టింది. చేతికందిన మ్యాచ్ ను కీలకమైన దశలో న్యూజిలాండ్ లాక్కుంది. ఫలితం మనకు తెలిసిందే. అయితే, ఈ సెమీఫైనల్ లో అదే న్యూజిలాండ్ పై ఘనవిజయంతో టీమిండియా తుదిపోరుకు దూసుకెళ్లింది. ఈ రివేంజ్ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యి 2003 వరల్డ్ కప్ ఫైనల్ పరాజయానికి ఆసిస్ పై భారత్ బదులు తీర్చుకుంటుందని ఫ్యాన్స్ కుండబద్దలు కొడుతున్నారు.