/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-24T154406.447-jpg.webp)
Largest Snake in The World: చాలా మంది పాము పేరు వింటేనే ఆమడ దూరం పరుగెడతారు. ఎందుకంటే ఇది ప్రపంచంలోని అత్యంత భయంకరమైన జీవుల్లో ఒకటి. ఏటా చాలా మంది పాము కాటుకు ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్ని రకాల విషపూరిత సర్పాలు కాటేస్తే కొన్ని నిమిషాల్లోనే చనిపోతారు.అయితే కొండచిలువ వంటి విషం లేని పాములు కూడా భూమిపై ఉన్నాయి. ఇవి భారీ శరీరంతో ఎరను గట్టిగా చుట్టేస్తాయి, ఎముకలు విరిచేయడం, ఊపిరాడకుండా చేయడం ద్వారా చంపేస్తాయి. అనంతరం అమాంతం మింగేస్తాయి. ఇలాంటి పాము జాతి గురించి మాట్లాడితే ముందు చెప్పుకోవాల్సిన పేరు అనకొండ.
అనకొండలు ప్రపంచంలోనే అతిపెద్ద పాము జాతులుగా గుర్తింపు పొందాయి. ఈ భూమిపై గుర్తించిన అత్యంత పొడవైన పాముగా గ్రీన్ అనకొండ (Green Anaconda) నిలుస్తుంది. ఇది అమెజాన్ చిత్తడి నేలలు, జలమార్గాలల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ పాములు సాధారణంగా 9 నుంచి 10 మీటర్ల పొడవు ఉంటాయి.స్మిత్‌సోనియన్ నేషనల్ జూ అండ్ కన్జర్వేషన్ బయాలజీ ఇన్‌స్టిట్యూట్ ప్రకారం, ప్రస్తుతం భూమి మీద జీవిస్తున్న అత్యంత బరువైన పాము జాతిగా కూడా గ్రీన్ అనకొండ నిలుస్తుంది. వీటిల్లో కొన్ని పాముల బరువు ఏకంగా 250 కిలోల వరకు ఉంటాయి. అయితే అతిపెద్ద గ్రీన్ అనకొండకు అధికారిక రికార్డు ఏదీ లేదు. 2016లో, బ్రెజిల్‌లోని నిర్మాణ కార్మికులు 10 మీటర్ల పొడవు గల గ్రీన్ అనకొండను చూశారు.
Also Read: కోటక్ మహీంద్రా కు ఆర్బీఐ బిగ్ షాక్.. క్రెడిట్ కార్డులతో పాటు, ఆన్లైన్ బ్యాంకింగ్.
టైటానోబోవా మరీ పెద్దది : పొడవు, బరువు పరంగా అనకొండ ప్రసిద్ధి చెందినప్పటికీ, టైటానోబోవా అనే పాము జాతి ముందు ఇది తక్కువనే చెప్పవచ్చు. ఈ పాము జాతి చాలా సంవత్సరాల క్రితం అంతరించి పోయినప్పటికీ, ఇది అనకొండ కంటే పొడవుగా ఉండేది. టైటానోబోవా సెరెజోనెన్సిస్ ఒకప్పుడు దక్షిణ అమెరికాలోని తేమతో కూడిన అడవులు, నదుల్లో కనిపించేది. టైటానోబోవా ఇప్పటివరకు ఉనికిలో ఉన్న అతిపెద్ద పాముల్లో ఒకటిగా పేర్కొంటున్నారు. ఈ పాము ప్రస్తుతం ఉనికిలో లేకపోయినా, 60 మిలియన్ సంవత్సరాల క్రితం ఇది ఏకంగా 13 మీటర్ల పొడవు ఉండేది.
భారతదేశంలో ‘వాసుక’ జాతి : మరోవైపు, ఈ నెలలో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఒక దశాబ్దానికి పైగా టైటానోబోవాను అతిపెద్ద పాముగా అందరూ భావిస్తున్నారు. అయితే లైవ్ సైన్స్ నివేదించిన ఇటీవలి పరిశోధనల్లో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. గుజరాత్‌లోని గని నుంచి వాసుకి ఇండికస్ అనే జాతి శిలాజాలు లభించాయి. ఈ పాము జాతి టైటానోబోవా కంటే 2 మీటర్ల పొడవు ఉండవచ్చని భావిస్తున్నారు. ఇవి 11 నుంచి 15 మీటర్ల మధ్య ఉండవచ్చని పేర్కొంటున్నారు. ఈ భారీ పాముకు హిందూ మతంలోని పౌరాణిక సర్పాల రాజు ఆధారంగా వాసుకి అనే పేరు పెట్టారు. ఈ జీవులు దాదాపు 47 మిలియన్ సంవత్సరాల క్రితం భూమిపై సంచరించాయి.