Vijayakanth Life: తుపానుల మధ్య పిడుగు.. విజయకాంత్ అంటే అంతే మరి!

రాజకీయమైనా..సినిమా అయినా,పట్టువదలకుండా పోరాటం..మహామహుల మధ్యలో పై చేయి కోసం ప్రయత్నం..అందుకే ఆయన తుపానుల మధ్య పిడుగు అంటుంది తమిళనాట ప్రజానీకం. ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత ఇటువంటి వారి మధ్యలో తనకంటూ ప్రత్యేకంగా కొన్ని పేజీలు ఘనంగా సృష్టించుకున్నారు కెప్టెన్ విజయకాంత్ 

Vijayakanth Life: తుపానుల మధ్య పిడుగు.. విజయకాంత్ అంటే అంతే మరి!
New Update

Vijayakanth Life: తమిళనాడులో విజయకాంత్ పేరు వినగానే మీకు గుర్తుకు వచ్చేది ఏంటని అడిగితే.. మంచివాడు, ధైర్యవంతుడు, నా అభిమాన నటుడు, కెప్టెన్, విప్లవ కళాకారుడు, నాయకుడు, DMDK నాయకుడు ఇలా ఎన్నో పేర్లు చెబుతారు. అయితే ప్రజల్లో ఇంత అభిమానాన్ని మూటగట్టుకున్న విజయ్ కాంత్ అసలు పేరు విజయరాజ్. విజయకాంత్ తమిళనాడులో సినీ నటుడిగా.. రాజకీయ నాయకుడిగా సంచలనాలు సృష్టించారు. అయితే, ఆయన సినిమాల్లోకి రావడం.. రాజకీయ నాయకుడిగా ఎదగడం ఎదో అలా అలా జరిగిపోలేదు. చిన్నప్పటి నుంచీ తాను కోరుకున్నది  సాధించడం కోసం చేసిన పట్టువదలని ప్రయత్నాలతో ఆయన సాధించిన విజయాలు అన్నీ, ఇన్నీ కావు. 

ఊరిలో ఏ సమస్య వచ్చినా.. 

Vijayakanth Life: తమిళనాడులోని మధురై లో 1952 ఆగస్టు 25న మైందన్ విజయరాజ్ ఒక మోస్తరు సంపన్న కుటుంబంలో పుట్టారు. చిన్నతనమంతా సంతోషంగా.. సరదాగా గడిపేశారు. చదువు మీద అసలు ఇంట్రస్ట్ లేదు. పదో తరగతి దాటి చదువుకోలేదు. ఆయన కుటుంబ సభ్యులు చదువుకోమని బలవంతమూ  చేయలేదు. అయితే, మధురైలో విజయకాంత్ కుటుంబం నివాసం ఉంటున్న తిరుమంగళం ప్రాంతంలో ఎవరికీ ఏ సమస్య వచ్చినా ఈయన వద్దకే వచ్చేవారు. ఊరి సమస్యలు కోసం గొడవలు.. చిక్కులు అనేకం వచ్చేవి. దీంతో ఆయన తల్లిదండ్రులు అళగరస్వామి, ఆండాళ్‌ దంపతులు నష్టాలు వచ్చినా ఫర్వాలేదు.. నీకిష్టం ఉన్నా లేకపోయినా మన రైస్ మిల్ బాధ్యత నువ్వు చూసుకోవలసిందే అంటూ అప్పచెప్పేశారు. అప్పుడు వారికి తెలీదు తమ కొడుకులో అంత మేనేజిమెంట్ స్కిల్స్ ఉన్నాయని. రైస్ మిల్ ను అద్భుతంగ విజయవంతంగా లాభాల బాటలో నిర్వహించారు విజయ్. అయితే, ఈ క్రమంలో తన దగ్గరకు సమస్యలతో వచ్చిన ఎవరికైనా సహాయం చేస్తూనే ఉన్నారు. వారి సమస్యల కోసం పోరాటం చేశారు. 

ఒకే సినిమా 70 సార్లు.. 

Vijayakanth Life: విజయకాంత్ కు చదువు మీద ఇంట్రస్ట్ లేదని చెప్పుకున్నాం కదా.. ఆయనకు ఊహ తెల్సిన దగ్గర నుంచీ అత్యంత ఇష్టమైన పని సినిమా చూడటం.  సినిమాలు చూసి.. చూసి తానూ నటుడు అవ్వాలని అనుకున్నారు. ఆయన నటుడుగా అవ్వాలని అనుకోవడానికి కారణం ఎంజీఆర్. ఎంజీఆర్ సినిమాలంటే విపరీతమైన పిచ్చి విజయ్ కాంత్ కి. ఎంజీఆర్ నటించిన అమ దిట్టుప్ పిల్లై చిత్రాన్ని దాదాపు 70 సార్లు చూశారు. ఈ సినిమా చూసిన తరువాతే ఆయన నటుడు కావాలని అనుకున్నారు. అంతకంటే ముందు  సినిమాల్లో ఎంజీఆర్ ప్రజల సమస్యలు తీర్చినట్టు.. తానూ ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని అనుకున్నారు. అందుకే పట్టణంలోని సమస్యలు పరిష్కారం కావాలంటూ విజయరాజ్ ఫీల్డ్ వర్క్ చేసేవారు. ఇక ఒక పక్క రైస్ మిల్ చూస్తూనే, పట్టణంలోని సమస్యలపై పోరాడుతూనే.. సినిమాల్లోకి వెళ్లాలన్న తన కోరికను తీర్చుకునే ప్రయత్నాలు చేశారు విజయ్.  

ఐరన్ లెగ్ అన్నారు.. 

Vijayakanth Life: సినిమా ప్రయత్నాల్లో చెన్నై చేరిన విజయ్ రాజ్.. అలుపెరుగకుండా స్టూడియో చుట్టూ తిరిగారు. కనపడిన వారినందరినీ సినిమా అవకాశాల కోసం అడిగారు. అప్పటివరకూ హాయిగా బ్రతికిన విజయ్ రాజ్ చెన్నై లో సినిమా అవకాశాల కోసం కష్టాల్లో పడ్డారు. ఆయన దగ్గర డబ్బు అప్పుగా తీసుకుని సినిమాల్లో ఉపయోగించుకున్నవారు కూడా, నటుడిగా అవకాశం అడిగితే.. నల్లగా ఉన్నావు.. అందంగా లేవు.. నీకు సినిమాలు ఎందుకు అంటూ ఎగతాళి చేశేవారు. అయితే, హీరో అవ్వాలనే పట్టుదలతో ఉన్న ఆయనకు తొలిసారి విలన్‌గా నటించే అవకాశం ‘ఇనిక్కుమ్ ఓహోలా’లో వచ్చింది. ఈ సినిమాలోనే విజయరాజ్ పేరును విజయకాంత్ గా మార్చారు. ఇనిక్కుమ్ అహోలా చిత్రం తర్వాత, ఆయన సినిమాలు జనాల్లో ఆదరణ పొందకపోవడంతో అదృష్టం లేని వాడని అందరూ అనేవారు. 

Vijayakanth Life: దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన విజయకాంత్ ఇదే చివరి ప్రయత్నం.. హిట్ కాకపొతే సినిమాలు వదిలేయాలి అనుకున్న సినిమా దూరతు ఇది ముజక్కమ్. ఇందులో ఆయన మత్య్సకారుడిగా నటించారు. ఈ సినిమా విజయ్ కాంత్ కి పెద్ద బ్రేక్ ఇచ్చింది. సినిమాల్లోకి అడుగుపెట్టిన దశాబ్దం తరువాత దక్కిన మొదటి సూపర్ హిట్ ఇది. దీని తరువాత తొలిదశలో ఆయన్ను తిరస్కరించిన నిర్మాతలంతా ఆయన వెంటే వరుస కట్టారు. అలా అలుపెరగకుండా  పనిచేసిన విజయకాంత్ ఒక్క ఏడాదిలో 18 సినిమాల్లో నటించారు.  వరుస విజయాల తర్వాత విజయకాంత్ ఒకానొక సమయంలో వరుస పరాజయాలను చవిచూశారు. దీంతో విజయకాంత్ సినిమా గ్రాఫ్ మళ్లీ పడిపోయింది. ఈ క్రమంలో విజయకాంత్ స్నేహితుడు రౌతర్ ప్రత్యేక సినిమా కంపెనీని ప్రారంభించి విజయకాంత్‌తో మొదటి సినిమా తీశాడు. ఈ సినిమా విజయకాంత్‌ని మళ్లీ అగ్రస్థానానికి తీసుకెళ్లింది. సినిమాలో పని చేసే ఆర్టిస్టులందరికీ కథానాయకుడిగా ఉన్నంత గౌరవం, ప్రాధాన్యత, ఆహారం లభించాలని విజయకాంత్ కోరుకున్నారు.  దాన్ని విప్లవ కళాకారుడు విజయకాంత్ అమలు చేశాడు. అంతే కాకుండా సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు అని ఆలోచించిన ఆయన  తన స్నేహితుడు రౌథర్ ఫిల్మ్స్ కార్యాలయంలో అటువంటి వారికోసం ప్రత్యేకంగా వసతి ఏర్పాట్లు చేశారు. అక్కడ ఉండే వారికి రోజూ భోజనం పెట్టేవారు. 

ఈలం అంటే పిచ్చి.. 

Vijayakanth Life: శ్రీలంకలో ఈలం యుద్ధం జరుగుతున్న సమయంలో తమిళనాడు వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు తన అభిమానులతో కలిసి నిరాహారదీక్ష చేశారు విజయ్ కాంత్. తరువాత కమల్‌తో సహా ప్రతి నటుడు ఈ ఆందోళనల్లో చేరారు. ఎల్‌టీటీఈ నాయకుడు ప్రభాకరన్‌పై ఉన్న గౌరవం కారణంగా ఆయన తన కుమారుడికి విజయ ప్రభాకరన్ అని పేరు పెట్టుకున్నారు.  తమిళనాడులో ఉచిత ఆసుపత్రులు నిర్మించడం దగ్గర్నుంచి పేదలకు సహాయం చేయడం వరకు.. ఎలాంటి సమస్య వచ్చినా విజయకాంత్ అభిమానులు తన మాటను శిరసావహిస్తూ వచ్చారు. సినిమాలకు అతీతంగా, సామాన్య ప్రజల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. అద్భుతమైన ఫాలోయింగ్.. ఫేమ్ ఉన్నప్పటికీ విజయ్ కాంత్ ఎప్పుడూ సింపుల్ గా కనిపించేవారు. 

Also Read: నటుడు విజయకాంత్ కన్నుమూత

రాజకీయల్లో ఇలా.. 

Vijayakanth Life: 1996లో విజయ్ కాంత్ నిర్వహించిన దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి సినీ ప్రపంచ స్వర్ణోత్సవ వేడుకలకు ఆనాటి ప్రముఖ నటీనటులు హాజరయ్యారు. దీని తర్వాత 1999లో అప్పుల ఊబిలో కూరుకుపోయిన దక్షిణ భారత నటీనటుల సంఘం అధ్యక్షుడిగా విజయ్ కాంత్ బాధ్యతలు చేపట్టారు. తమిళనాడులో ఇప్పటి వరకు విజయకాంత్ ద్వారా లబ్ది పొందిన కుటుంబాల సంఖ్య ఎంతో చెప్పలేం కానీ, గ్రామానికి కనీసం ఒక కుటుంబమైనా ఆయన నుంచి సహాయం పొంది ఉంటుందని అక్కడ చెప్పుకుంటారు. 2005లో తాను జన్మించిన మధురైలో విజయకాంత్ రాజకీయ పార్టీని ప్రారంభించారు. ఆ సమయంలో ఆయన చేసిన నినాదాలలో ముఖ్యమైనది "లేని వారికి చేతనైనంత చేద్దాం". విజయకాంత్ కూడా ఇలాగే జీవించారు. మరికొద్ది నెలల్లో వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 234 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టారు.  తొలి ఎన్నికల్లో 8 శాతానికి పైగా ఓట్లు సాధించడమే కాదు, ఆపార్టీ నుంచి తొలి శాసనసభ్యుడిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత 2009 పార్లమెంటరీ ఎన్నికలు డీఎండీకి విజయావకాశాలు ఇవ్వకపోయినా ఓట్ల శాతాన్ని పెంచుకోవడానికి దోహదపడ్డాయి. ఇలా 2011 అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో రెండు ప్రధాన పార్టీలు డీఎంకే, ఏఐఏడీఎంకే విజయకాంత్ కు వల విసిరాయి. డీఎంకేను అన్నాడీఎంకే వైపు తీసుకురావడంలో సినీ నటుడు, పాత్రికేయుడు చో కీలక పాత్ర పోషించారు.  2011 ఎన్నికల్లో 21 సీట్లు గెలుచుకోవడమే కాదు, అన్నాడీఎంకేను అధికార పీఠం ఎక్కించడంలో డీఎండీ పాత్ర కీలకంగా ఉంది. తరువాత విజయకాంత్ డీఎంకేను పక్కకు నెట్టి  అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎదిగారు. అసెంబ్లీలో కొంత రచ్చ జరగడంతో సభ నుంచి వెళ్లిపోవడంతో విజయకాంత్ రాజకీయ ప్రస్థానం దిగజారింది. 

సినీ కెరీర్‌కు ముందు నుంచే ప్రజా జీవితంపై మక్కువ పెంచుకున్న విజయకాంత్(Vijayakanth Life).. ఆ తర్వాత దివంగత మాజీ ముఖ్యమంత్రులు కరుణానిధి, జయలలిత హయాంలో పార్టీని ప్రారంభించి శాసనసభ ప్రతిపక్ష నేతగా ఎదిగారు. అందుకే తుపానుల మధ్య కనిపించే పిడుగుగా ఆయనను అభివర్ణిస్తారు.  విజయకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉండి ఉంటే రాష్ట్రానికి విజయకాంత్‌ను ముఖ్యమంత్రిని చేసి ఉండేవారని అక్కడి ప్రజలు ఘంటాపథంగా ఇప్పటికీ చెబుతారు. 

కానీ అతని ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది, ఆయన్ని చాలా కాలం పాటు అన్ని కార్యక్రమాలకు  దూరంగా ఉంచింది అనారోగ్యం.  ఆ అనారోగ్యంతోనే ఈ రోజు అంటే డిసెంబర్ 28 న, DMD నాయకుడు కెప్టెన్ విజయకాంత్ మరణించారు. ఆయన మరణించినా.. తమిళనాట ఆయన పేరుతొ చరిత్రలో కొన్ని పేజీలు.. ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం అలా నిలిచే ఉంటాయి. 

Watch this interesting Video:

#actor-vijayakanth-died #vijay-kanth
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe