వారంతా బాణాసంచా ఫ్యాక్టరీలో పని చేస్తున్న కార్మికులు.. రోజులాగే విధులకు వచ్చారు. తోటి కార్మికులతో ముచ్చటిస్తూ పనిలో నిమగ్నమయ్యారు. మధ్యాహ్నం అందరూ లంచ్ చేస్తూ మాట్లాడుకున్నారు. సరదగా గడిపారు. మళ్లి పనిలో బిజీ ఐపోయారు. కానీ ఇంతలోనే ఊహించని విధంగా మృత్యువు దాడి చేసింది. ఫ్యాక్టరీలో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. అందరూ బయటకు పరుగులు తీశారు. మరికొందరు మాత్రం ఫ్యాక్టరీలోనే చిక్కుకుపోయారు. మంటలకు ఆహుతయ్యారు. బయట పడే దారిలేక మంటల్లోనే కాలిపోతున్న శరీరాన్ని రక్షించుకోలేక సజీవ దహనమయ్యారు. చివరి క్షణంలో కుటుంబాన్ని, పిల్లలను తలుచుకుంటూ ఈ లోకాన్ని వీడారు. తమిళనాడులో ఈ తరహా ఘటన జరగడం ఇది వారంలో రెండోసారి.
భారీ పేలుడు.. 9మంది మృతి:
తమిళనాడు(Tamilnadu)లోని అరియలూర్(Ariyalur)లోని బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 9మంది ప్రాణాలు కోల్పోయారు. పేలుడు సంభవించిన తర్వాత ఫ్యాక్టరీ నుంచి పలు మృతదేహాలను బయటకు తీశారు. క్షతగాత్రులను అత్యవసర చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని తంజావూరు మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేర్చి ప్రత్యేక వైద్యసేవలు అందిస్తున్నారు. తొమ్మిది మంది మృతి పట్ల ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సంతాపం తెలిపారు. వారి కుటుంబాలకు నగదు సాయం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.3 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.1 లక్ష, సాధారణ గాయాలు అయిన వారికి రూ.50,000 పరిహారం ప్రకటించారు.
వరుసగా రెండో ఘటన:
తమిళనాడులోని మైలాడుదురైలో ఉన్న ఓ బాణాసంచా గోడౌన్‌లో కార్మికులు పనిలో నిమగ్నమై ఉండగా..ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటన అక్టోబర్ 5న జరిగింది. పేలుడు సంభవించిన వెంటనే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పటాకుల గోడౌన్ కావడంతో కార్మికుల శరీరాలు వంద మీటర్ల దూరం ఎగిరిపడ్డాయి. మరికొందరు తీవ్రంగా గాయాలపాలయ్యారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. చనిపోయిన నలుగురు కార్మికులను కూడా మాణికం, మదన్, రాఘవన్, నికేష్ గా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన వారిని అగ్ని మాపక సిబ్బంది రక్షించారు. గోడౌన్ యజమానికి లైసెన్స్ కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.