/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-03T165319.258-jpg.webp)
ఒకప్పుడు గుంటూరు టాకీస్, కృష్ణ అండ్ హిస్ లీలా వంటి విభిన్న కథలతో ప్రేక్షకుల ముందుకు సిద్ధు జొన్నలగడ్డ వచ్చాడు. కానీ ఆ చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆయనకు ఇమేజ్ను తెచ్చిపెట్టలేదు. కొన్ని చిత్రాల్లోనూ సిద్ధు సైడ్ క్యారెక్టర్లు కూడా చేశారు. అయితే ఈ క్రమంలో DJ టిల్లుగా వచ్చి బాక్సాఫీస్ ముందు సౌండ్ మోగించాడు. ఇది యువతను బాగా ఆకట్టుకుంది. దీంతో ఆయన స్టార్ స్టేటస్ అందుకున్నారు. ఈ చిత్రం విడుదల అయ్యాక అన్ని వయసుల వారికి టిల్లు క్యారెక్టర్ తెగ నచ్చేసింది. "అట్లుంటాది మనతోని" అంటూ టిల్లు అనే డైలాగ్ అప్పట్లో బాగా పాపులర్ అయింది. హీరోయిన్ను రాధిక అని పిలిచే విధానంతో పాటు ఆమెతో పడే పాట్లు ప్రేక్షకులను బాగా నవ్వించాయి.
అయితే ఈ సినిమాకు కొనసాగింపుగా బాగా హైప్ పెంచి ఇప్పుడు టిల్లు స్క్వేర్తో వచ్చాడు సిద్ధు జొన్నలగడ్డ. ఇందులోనూ టిల్లు వన్ లైనర్ పంచులతో అదరగొట్టేశాడు. హీరోయిన్గా అనుపమ పరమేశ్వరన్ బోల్డ్‌గా నటించి ఫస్ట్ పార్ట్‌లో ఉన్న రాధికకు ఏమాత్రం తీసిపోనట్టుగా లిల్లీ పాత్రతో ఆకట్టుకుంది. దీంతో బాక్సాఫీస్ ముందు టిల్లన్న జోరు ఆగట్లేదు. తెలుగు చిత్రసీమ బాక్సాఫీస్‌తో పాటు ఓవర్సీస్లోనూ దూకుడు ఇంకా కొనసాగుతోంది. నార్త్ అమెరికాలో బ్లాక్ బస్టర్ టాక్ అందుకున్న ఈ చిత్రానికి ఇప్పటివరకు 2.1 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూలు అయినట్లు తెలిసింది. ఇక వరల్డ్ వైడ్ రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్లను అందుకునేందుకు మరింత చేరువగా వచ్చినట్లు మూవీటీమ్ అధికారికంగా అనౌన్స్ చేసింది. ఐదు రోజుల్లో రూ.85 కోట్ల గ్రాస్ వసూళ్లు అందుకున్నట్లు తెలిపింది. మా స్టార్ బాయ్ రికార్డులను బ్రేక్ చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది.
సినిమా విషయానికొస్తే వన్ నైట్ స్టాండ్‌లో లిల్లీని కలిసిన టిల్లు ఆ తర్వాత తను చెప్పా పెట్టకుండా వెళ్లిపోవడంతో బాధ పడతాడు. ఆ తర్వాత రాధికతో ఇబ్బంది పడినట్లే లిల్లీతో కూడా ఇబ్బంది పడతాడు. స్క్రీన్ మీద టిల్లు పాట్లు పడుతుంటే చూస్తున్న ప్రేక్షకులు అతని కామెడీ టైమింగ్‌కు తెగ నవ్వుకుంటున్నారు. ఇకపోతే టిల్లు స్క్వేర్ హిట్ ఇచ్చిన కిక్‌తో ఈ సినిమాకు మూడో భాగాన్ని కూడా అప్పుడే అనౌన్స్ చేసేశారు మేకర్స్. DJ టిల్లులో రాధికతో, టిల్లు స్క్వేర్‌లో లిల్లీతో పాట్లు పడిన టిల్లన్న మరి టిల్లు క్యూబ్‌లో ఎవరితో పాట్లు పడతాడో చూడాలి.