వరల్డ్ డేషింగ్ బిజినెస్ మేన్ ,ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ మైండ్ లో పురుగు మళ్లీ మెదిలింది. ఈ సారి పిట్టను తీసేస్తున్నాడు. అదేనండి ట్విటర్ పిట్ట బొమ్మ స్థానంలో ఎక్స్ ని పెడుతున్నాడు. దీంతో ఇప్పటి వరకు పిటపిటలాడిన పిట్ట ఇప్పుడు ఎలాన్ మస్క్ కొత్తలోగో పుణ్యమాని ఎగిరి ఎక్స్(X) అయిపోయింది. అయితే ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర పరిస్థితి చోటు చేసుకుంది.
ట్విట్టర్ లోగో మారిన తరుణంలో తమ భవనం నుంచి పాత లోగోను తొలగిస్తున్న ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు.విషయం ఏంటంటే..రీబ్రాండింగ్ ప్రక్రియలో భాగంగా శాన్ ఫ్రాన్సిస్కో 1355 మార్కెట్ స్ట్రీట్ కార్యాలయంలోని కొంతమంది ఉద్యోగులు క్రేన్ సాయంతో ట్విట్టర్ కొత్తలోగోను రీప్లేస్ చేస్తుండగా అసలు సంగతి తెలియని శాన్ ఫ్రాన్సిస్కో పోలీసులు లోగోను తొలగిస్తున్న ఉద్యోగులను నిలువరించారు.
బంగారం లాంటి లోగోను ఎందుకు తీసేస్తున్నారు కేజీల్లెక్కన అమ్మేసుకుందాం అనుకుంటున్నారా అన్నట్టుగా హడావుడి చేశారు. మన మస్క్ తాజా నిర్ణయం గురించి తెలియని పోలీసులు ట్విట్టర్ ఉద్యోగులను అదుపులోనికి తీసుకున్నారు.
అయితే ఈ సందర్భంగా కొన్ని తమాషాలు కూడా చోటుచేసుకున్నాయి. తొలగింపు ప్రక్రియలో ఉపయోగించిన క్రేన్ కు మస్క్ అనుమతి పొందలేదని, ఇది పోలీసుల ప్రతిస్పందనను ప్రేరేపించిందని ట్వీట్ చేశారు.
కానీ అసలు విషయం తెలిసిన పోలీసులు నాలిక్కరుచుకున్నారు. పరిస్థితి పరిశీలించిన తర్వాత వారు ఎటువంటి నేరం చేయలేదని అసలు ఈ సంఘటన తమ పరిధిలో లేదని ప్రకటించారు.
కాగా ట్విట్టర్ కు ప్రస్తుతం ఉన్న ఐకాన్ లోగోను కాదని, మస్క్ తన వ్యక్తిగత ప్రాధాన్యతకు అనుకూలంగా బ్రాండ్ పేరును మార్చిన సంగతి తెలిసిందే. దీంతో 4 – 20 బిలియన్ డాలర్లు మస్క్ సంపద తుడిచిపెట్టుకు పోయిందని విశ్లేషకులు,బ్రాండ్ ఏజెన్సీల అంచనా.