రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేయబోతున్నట్లు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. అయితే ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాననే దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఖమ్మం జిల్లాలోని నాయకన్ గూడెంలో అనుచరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. తాను ఉమ్మడి జిల్లా అభివృద్ధికి కృషి చేశానని, ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కోసం పని చేశానన్నారు. మరోవైపు గత 40 ఏళ్లుగా జిల్లా ప్రజలకు సేవ చేస్తున్నానన్న ఆయన.. ఎన్నడూ అధికారం కోసం ఆరాటపడలేదని, ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకుంటూనే తాను ముందుకు వెళ్లాలని వెల్లడించారు.
తాను గతంలోనే రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావించానన్న తుమ్మలా.. జిల్లా ప్రజల బాగోగల గురించి ఆలోచించి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు తెలిపారు. ఖమ్మం గడ్డపై ఎందరో మహానుభావులు పుట్టారన్న ఆయన.. వారందరికంటే తనకే ఎక్కువ అవకాశాలు వచ్చాయని గుర్తు చేశారు. పాలేరు ప్రజలు తనను ఆశీర్వదిస్తే తాను రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాగా గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ అభ్యర్థి ఉపేందర్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యాడు. అనంతరం పాలేరు ఎమ్మెల్యే బీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నాడు. దీంతో కేసీఆర్ పాలేరులో సిట్టింగ్ ఎమ్మెల్యేకే టికెట్ ఇవ్వడంతో తుమ్మలకు మొండి చేయి ఎదురైంది.
తనను గుండెల్లో పెట్టుకున్న కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. నన్నుఆదరిస్తారని మీ ముందుకు వచ్చానని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. తాను ఎక్కడా తల వంచనన్న ఆయన.. తల వంచినట్లు రుజువైతే తాను తల నరుక్కుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా అంతకు ముందు తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లాలో నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనం కార్యాక్రామానికి సుమారు 2 వేల కార్లు, బైక్‌లతో భారీ ర్యాలీ తీశారు. . తుమ్మల నాగేశ్వరరావు అనుచరులు పెద్ద సంఖ్యలో రావడంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అనంతరం భారీ కాన్వాయ్‌తో మాజీ మంత్రి తుమ్మల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి చేరుకున్నారు.