హైదరాబాద్ ఐటీకారిడార్ లో మహిళా ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ లేడీస్ స్పెషల్ బస్సు JNTU-WAVEROCK మార్గంలో ఉదయం, సాయంత్రం నడుస్తుందని టీఎస్ ఆర్టీసీ తెలిపింది. ఈనెల 31 నుంచి అందుబాటులోకి వచ్చే విధంగా ఈ ప్రత్యేక బస్సును మహిళ ప్రయాణికులు వినియోగించుకుని క్షేమంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని సంస్థ కోరింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఓ ప్రకటన విడుదల చేశారు.
జూలై 31 నుంచి ఫోరమ్, నెక్సస్ మాల్, హైటెక్ సిటీ, మైండ్ స్పేస్, రాయదుర్గ్, బయోడైవర్సిటీ పార్క్, గచ్చిబౌలి 'ఎక్స్' రోడ్, ఇందిరా నగర్, ఐఐటీ 'ఎక్స్' రోడ్, విప్రో సర్కిల్, ఐసీఐసీఐ టవర్ల మీదుగా బస్సు వెళ్తుంది. టీఎస్ఆర్టీసీ తెలిపిన వివరాల ప్రకారం...మొదట్లో, బస్సు సర్వీస్ ప్రతిరోజు ఉదయం 9.05 గంటలకు JNTU నుండి వేవ్ రాక్ వైపు, వేవ్ రాక్ నుండి JNTU వైపు సాయంత్రం 5.50 గంటలకు ప్రారంభమవుతుందని తెలిపారు.
అయితే బస్సుల ట్రిప్పులపై వచ్చే స్పందన ఆధారంగా భవిష్యత్తులో మరిన్ని సర్వీసులను ఈ మార్గంలో నిర్వహిస్తామని ఆర్టీసీ సీనియర్ అధికారులు తెలిపారు.బాచుపల్లి, ఈసీఐఎల్, ఉప్పల్, మేడ్చల్, శామీర్‌పేట, మేడిపల్లి తదితర ప్రాంతాల్లోని ఐటీ ఉద్యోగుల నుంచి కూడా ఐటీ కారిడార్‌లో బస్సులను ప్రవేశపెట్టాలని కోరుతున్నారు. కాగా టీఎస్ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయంపై ఐటీ కారిడార్ లో ఉద్యోగం చేస్తున్న మహిళా ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రద్దీగా ఎక్కువగా ఉండటం, క్యాబ్స్, ర్యాపిడో వెహికల్స్ పై ఆదారపడాల్సిన అవసరం ఇప్పుడు ఉండదంటున్నారు. ఇంత మంచి నిర్ణయం తీసుకున్న ఆర్టీసీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు
ఆర్టీసీ కు ఎండీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సజ్జనార్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా మహిళల కోసం ప్రత్యేక చర్యలు తీసుకొస్తున్నారు. గతేడాది(2022) మహిళలు సురక్షితంగా ఇంటికి చేరుకొనేందుకు ప్రత్యేక యాప్‌ను తీసుకొచ్చారు. ఇక ప్రయాణికులు, సొంత సిబ్బంది ఆర్టీసీకి సంబంధించి ఫిర్యాదులను, సూచనలను నేరుగా తన దృష్టికి తీసుకుని వచ్చేందుకు వీలు కల్పిస్తున్నారు