తెలుగు రాష్ట్రాల్లో.. ముఖ్యంగా తెలంగాణలో అతి ముఖ్యమైన పండుగల్లో దసరా (Dasara 2023) ఒకటి. ఈ పండుగ వచ్చిందంటే చాలు.. అందరూ సొంతూళ్లకు వెళ్లడంతో పట్టణాలు, నగరాలన్నీ ఖాళీ అవుతాయి. పండుగకు పది రోజుల ముందు నుంచే బస్సులు, రైళ్లన్నీ కిక్కిరిసిపోయి కనిపిస్తుంటాయి. టోల్ గేట్ల వద్ద కూడా వాహనాలు బారులుదీరుతుంటాయి. ఇదే అదనుగా ప్రైవేట్ వాహనాల వారు టికెట్ ధరలను కూడా రెట్టింపు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ (TSRTC) పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారికి అదిరిపోయే శుభవార్త చెప్పింది. ముందస్తు గా టికెట్ బుకింగ్ చేసుకునే వారికి 10 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్టర్ (ఎక్స్) ద్వారా ప్రకటన చేశారు. అక్టోబర్ 15 నుంచి 29 తేదీల మధ్యలో ప్రయాణానికి రానుపోనూ ఒకేసారి టికెట్లు బుకింగ్ చేసుకుంటే, తిరుగు ప్రయాణం పై 10 శాతం డిస్కౌంట్ కల్పిస్తున్నట్లు ప్రకటించారు.
ఆయా తేదిల్లో ప్రయాణానికి ఈ నెల 30వ తేదీ వరకు ముందస్తు రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికులకు మాత్రమే 10 శాతం రాయితీ వర్తిస్తుందని సజ్జనార్ స్పష్టం చేశారు. రిజర్వేషన్ సదుపాయమున్న అన్ని సర్వీసుల్ ఈ రాయితీ అమల్లో ఉంటుందని వివరించారు. ఈ సందర్బంగా సజ్జనార్ మాట్లాడుతూ.. “బతుక్మమ్మ, దసరా చాలా పెద్ద పండుగలు. ఈ పర్వదినాలకు హైదరాబాద్ నుంచి ఎక్కువగా సొంతూళ్లకు వెళ్తారు.
గ్రామీణ ప్రాంతాల్లోనూ అనేక మంది రాకపోకలు సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఆర్థిక భారం తగ్గించేందుకు 10 శాతం రాయితీని ఇవ్వాలని సంస్థ నిర్ణయించింది. దసరా పండుగ సెలవుల సమయంలో 15 రోజులు మాత్రమే ఈ రాయితీ అమల్లో ఉంటుంది. సుదూర ప్రాంతాలకు వెళ్లే వారు ఈ డిస్కౌంట్ సదుపాయాన్ని ఉపయోగించుకొని, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలి. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కొరకు సంస్థ అధికారిక వెబ్ సైట్ http://tsrtconline.in ని సంప్రదించాలి.” అని అన్నారు.