ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్ టార్గెట్‌గా కాంగ్రెస్ ఎక్కువగా విమర్శించిన అంశం TSPSC. గ్రూప్-1 రద్దవడం, గ్రూప్-2 వాయిదా పడడం, గ్రూప్-3కి పరీక్ష డేటే రాకపోవడం లాంటి ఎన్నో విషయాలను ప్రస్తావిస్తూ బీఆర్‌ఎస్‌ను ఇరుకునే పెట్టింది కాంగ్రెస్. అధికారంలోకి వస్తే TSPSCని ప్రక్షాళన చేస్తామని సాక్ష్యాత్తు నాటి మంత్రి కేటీఆరే చెప్పడం సంచలనం రేపింది. TSPSC ప్రక్షాళన చేయడమంటే దాని అర్థం అప్పటివరకు బోర్డు ఫెయిల్ అయిందని కేటీఆర్ ఒప్పుకున్నట్లే కదా అని కాంగ్రెస్ విమర్శల దాడి చేసింది. తాము అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ సహా నిరుద్యోగుల కోసం గ్రూప్ నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తామని పదేపదే చెప్పారు. మ్యానిఫెస్టోలో సైతం జాబ్ క్యాలెండర్‌ను మెన్షన్ చేశారు. ఇలా ఎన్నికల అస్త్రంగా మారిన TSPSCలో భారీ మార్పులు జరగనున్నట్లు స్పష్టమవుతోంది. TSPSC చైర్మన్‌గా జనార్దన్ రెడ్డి రాజీనామా చేశారు.
రేవంత్ ని కలిసిన కాసేపటికే రాజీనామా:
TSPSC చైర్మన్‌గా జనార్దన్ రెడ్డి(Janardhan Reddy) రాజీనామా చేశారు. జనార్దన్‌రెడ్డి రాజీనామాను గవర్నర్ ఆమోదించి సీఎస్‌కు పంపారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కాసేపటికే ఆయన తన పదవికి రాజీనామా చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. బోర్టుకు సంబంధించిన వివిధ అంశాలపై సీఎం, జనార్దన్ రెడ్డి చర్చించినట్లు వార్తలొచ్చాయి. ఇంతలోనే చైర్మన్ పదవికి ఆయన రిజైన్ చేశారు. 2021 మేలో TSPSC చైర్మన్‌గా జనార్దన్ రెడ్డి నియమితులైన విషయం తెలిసిందే.
గ్రూప్ పరీక్షలను రీ షెడ్యూల్ చేస్తారా?
గ్రూప్ I, గ్రూప్ II, గ్రూప్ III, గ్రూప్ IV రిక్రూట్‌మెంట్ పరీక్షల మొత్తం పరీక్ష షెడ్యూల్‌ను పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలు, నోటిఫికేషన్‌ల వివరాలతో తదుపరి సమీక్ష సమావేశానికి హాజరుకావాలని ముఖ్యమంత్రి కార్యాలయం టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌కు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఆదేశాలు జారీ చేసిన కాసేపటికే చైర్మన్‌గా ఉన్న జనార్దన్ రెడ్డి రాజీనామా చేశారు. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి పేపర్ లీకేజీలు, పరీక్షల వాయిదాల కారణంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న తెలంగాణ నిరుద్యోగ యువతకు రేవంత్ రెడ్డి తీసుకోనున్న రీషెడ్యూల్ నిర్ణయం కొత్త ఆశను కలిగించేలా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: షమీని ఓడించిన వరల్డ్ కప్ హీరో.. ఎవరంటే?