పటేల్ రమేష్ రెడ్డికి, తనకూ మధ్య ఎలాంటి విభేదాలు లేవని సూర్యాపేట కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి (Ramreddy Damodar Reddy) అన్నారు. రమేష్ రెడ్డి స్వచ్ఛందంగా తన నామినేషన్ ను ఉపసంహరించుకున్నారన్నారు. ఆయనకు సముచిత స్థానం కల్పించడం ఏఐసీసీతో పాటు తన బాధ్యత కూడా అని అన్నారు. ఆర్టీవీకి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా దామోదర్ రెడ్డి మాట్లాడుతూ.. తనను వృద్ధ సింహం అంటున్న బీఆర్ఎస్ (BRS) నేతలు.. తనకన్నా వయస్సులో పెద్ద అయిన కేసీఆర్ ఏం అవుతారో చెప్పాలని ప్రశ్నించారు. రాజకీయ నాయకులకు 60 ఏళ్ల తర్వాతే మరింత పరిణితి వస్తుందన్నారు. ఈ ప్రాంతానికి ఎస్ఆర్ఎస్పీ జలాలను తీసుకువచ్చింది తానే అని అన్నారు. మంత్రిగా ఉండి ఒక్క సబ్ స్టేషన్ కూడా తీసుకురాలేదని జగదీష్ రెడ్డిపై ధ్వజమెత్తారు. రోడ్లు వేసి లైట్లు వేసినంత మాత్రాన.. అభివృద్ధి కాదన్నారు. ఎస్సారెస్పీ కాల్వలకు కనీసం తూములు కూడా ఏర్పాటు చేయలని పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉందని మండిపడ్డారు. తుంగతుర్తి, సూర్యాపేటలో పారుతున్నవి కాళేశ్వరం నీరు కాదన్నారు. గోదావరి జలాలను తీసుకువచ్చింది తామేనని అన్నారు దామోదర్ రెడ్డి. ఇందుకోసం తాను గతంలో అనేక ఉద్యమాలు చేశానని గుర్తు చేశారు.
ఇది కూడా చదవండి: Raja Singh: ‘చంపేస్తా’.. సొంత పార్టీ నేతలకు రాజాసింగ్ సీరియస్ వార్నింగ్..
ఈ రాష్ట్రంలో ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అని అన్నారు. కరెంట్ గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ ప్రభుత్వానికి లేదన్నారు. ఏడు గంటలు కరెంట్ ఇవ్వలేని ఈ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ చెప్పేది ఒకటి.. చేసేది మరొకటని ధ్వజమెత్తారు. ఎన్నికైన అభ్యర్థుల అభిప్రాయం ప్రకారమే కాంగ్రెస్ సీఎం ఎన్నిక ఉంటుందన్నారు దామోదర్ రెడ్డి. సూర్యాపేట ప్రాంతానికి ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదని మంత్రిపై మండిపడ్డారు. ఆయన తన ఆస్తులను పెంచుకోవడానికే పని చేశాడన్నారు. ఈ ప్రాంతంలో అన్ని పనులు చేసేది ఒక్క కాంట్రాక్టరే అని నిప్పులు చెరిగారు.
ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అనుకూలంగా లేకపోవడంతో అక్కడ వ్యాపారులెవరూ అమ్ముకోవడం లేదన్నారు. జగదీష్ రెడ్డి అనుచరులే ఈ ప్రాంతంలో దందాలు చేస్తున్నారన్నారు. తాను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే సూర్యాపేట ప్రశాంతంగా ఉందన్నారు. ఆస్తులు, అభివృద్ధిపై చర్చకు రావాలని మంత్రి జగదీష్ రెడ్డికి సవాల్ విసిరారు దామోదర్ రెడ్డి. తుంగతుర్తిలోనూ కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలవబోతున్నామన్నారు. తుంగతుర్తి అభివృద్ధి చేసింది తానే అని అన్నారు. ఉమ్మడి జిల్లాలో 12 సీట్లను కాంగ్రెస్ గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోనూ అధికారం తమదేనన్నారు. దామోదర్ రెడ్డి పూర్తి ఇంటర్వ్యూను ఈ కింది వీడియోలో చూడండి.