Tummala Vs Puvvada: పువ్వాడ నామినేషన్ చెల్లదు.. రిటర్నింగ్ ఆఫీసుకు తుమ్మల సంచలన ఫిర్యాదు

ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్లో సమగ్ర వివరాలు లేవని కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు రిటర్నింగ్ ఆఫీసర్ కు ఫిర్యాదు చేశారు. అజయ్ నామినేషన్ ను తిరసర్కరించాలని కోరారు.

New Update
Tummala Vs Puvvada: పువ్వాడ నామినేషన్ చెల్లదు.. రిటర్నింగ్ ఆఫీసుకు తుమ్మల సంచలన ఫిర్యాదు

ఖమ్మం జిల్లాలో ఎన్నికల రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఓ వైపు ప్రచారం, విమర్శలు, ప్రతివిమర్శలతో పాటుగా ఫిర్యాదులు సైతం జోరుగా చేసుకుంటున్నారు. తాజాగా ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి పువ్వాడ అజయ్ (Puvvada Ajay) దాఖలు చేసిన నామినేషన్ చెల్లదని రిటర్నింగ్ ఆఫీసర్ కు కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వర్ రావు (Tummala Nageshwar Rao) ఫిర్యాదు చేశారు. నిబంధనలకు అనుగుణంగా ఆయన తన నామినేషన్ పత్రాల్లో డిపెండెంట్ 1, 2, 3 వివరాలను పొందు పర్చలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని పువ్వాడ నామినేషన్ ను తిరస్కరించాలని తుమ్మల కోరారు. అయితే.. పువ్వాడ నామినేషన్ పత్రాలు సరిగానే ఉన్నాయని రిటర్నింగ్ అధికారి తుమ్మలకు సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఈ విషయమై తుమ్మల కోర్టుకు వెళ్లే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Telangana BJP:ప్రచారంలో వేగం పెంచుతున్న బీజేపీ…16న మేనిఫెస్టో విడుదల

మంత్రి పువ్వాడపై తుమ్మల అనర్హత అస్త్రం ప్రయోగించడం జిల్లా రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. పువ్వాడ ఎన్నికల నిబంధనల్ని ఉల్లంఘించారని తుమ్మల వర్గం ఆరోపిస్తోంది. ఈసీ రూల్స్‌కి విరుద్ధంగా పువ్వాడ నామినేషన్‌ వేశారని వారు చెబుతున్నారు. అఫిడవిట్‌, నామినేషన్‌ను ఫామ్‌ 26 ప్రకారమే సమర్పించాలంటున్నారు. అందులో మార్పులు, చేర్పులు చేయకూడదని తుమ్మల న్యాయవాది స్పష్టం చేస్తున్నారు. ఫామ్‌ 26లో పువ్వాడ మార్పులు చేశారని ఆరోపిస్తున్నారు. ఆర్వోకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెబుతున్నారు. ఆర్వోపై సీఈసీకి తుమ్మల ఫిర్యాదు చేయబోతున్నట్లు సమాచారం.

ఇదే ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెంలోనూ రిటర్నింగ్ ఆఫీసర్ కు ఇలాంటి ఫిర్యాదే వచ్చింది. కొత్తగూడెం రిటర్నింగ్ అధికారికి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే జలగం ఫిర్యాదు చేశారు. ఐపీసీ 170 ప్రకారం కొత్తగూడెం బీఆర్ఎస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు నామినేషన్ తిరస్కరించాలని కోరారు. వనమా ఎన్నికల అఫిడవిట్ లోని పలు అంశాలను జలగం వెంకట్రావ్ ఎత్తిచూపారు. అఫిడవిట్ లో సమగ్ర ఆస్తుల వివరాల ప్రకటన, పెండింగ్ పన్నులు, చలాన్లను వనమా ప్రస్తావించలేదంటూ ఆధారాలతో సహా రిటర్నింగ్ అధికారికి వెంకట్రావు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

నామినేషన్ తిరస్కరణ అభ్యర్థన విషయంలో తీసుకోబోయే నిర్ణయాన్ని లిఖితపూర్వకంగా తెలపాలని జలగం కోరినట్లు వార్తలు వస్తున్నాయి. 2018 సార్వత్రిక ఎన్నికల అనంతరం ఎన్నికల అఫిడవిట్ లో వనమా పొందుపరిచిన సమాచారం ఆధారంగా జలగం న్యాయ పోరాటం చేసిన విషయం తెలిసిందే. జలగం పిటిషన్ ఆధారంగా వనమాపై హైకోర్టు అనర్హత వేటు కూడా వేసింది. అయితే.. సుప్రీంకోర్టు లో స్టే లభించడంతో వనమా ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుత ఫిర్యాదుపై రిటర్నింగ్ అధికారి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.

Advertisment
తాజా కథనాలు