Heart Attack Symptoms: అప్పటి వరకు పని చేసుకుంటున్న వారు ఉన్నట్టుండి కుప్పకూలి ప్రాణాలు వదిలిన ఘటనలు చాలానే ఉన్నాయి. అయితే హార్ట్ అటాక్(heart attack) లక్షణాలు, సంకేతాలను గుర్తిస్తే ప్రాణాలు పోకుండా కాపాడుకోవచ్చు. ముఖ్యంగా కొన్ని సంకేతాలు, తర్వలో మీకు గుండెపోటు రావచ్చని వార్నింగ్ ఇస్తాయి. అలాంటప్పుడు వీలైనంత త్వరగా హాస్పిటల్‌కు వెళ్లి ట్రీట్‌మెంట్ తీసుకుంటే, ప్రమాదం తప్పుతుంది. హార్ట్ అటాక్ ప్రధాన సంకేతాలు ఎలా ఉంటాయో ఎప్పుడు చూద్దాం.
వికారం లేదా తేలికపాటి తలనొప్పి
హార్ట్ అటాక్ వచ్చే ముందు మీకు వికారం లేదా మైకంగా అనిపించవచ్చు. కొన్నిసార్లు అజీర్తి లేదా సాధారణ జలుబు కారణంగా కూడా ఇలాంటి అసౌకర్యం ఉండవచ్చు. అయితే గుండెకు రక్త ప్రసరణ తగ్గితే, మీ శరీరంలోని ఇతర వ్యవస్థలు కూడా ప్రభావితం అవుతాయి. దీంతో జీర్ణశయాంతర సమస్యలు లేదా మైకం వంటివి రావచ్చు. ఈ లక్షణాలు ఛాతీ నొప్పి లేదా ఊపిరి ఆడకపోవడం వంటి ఇతర సంకేతాలతో కలిసి ఉంటే హార్ట్ అటాక్ రావచ్చు.
శ్వాస ఆడకపోవడం
గుండె సరిగా రక్తాన్ని పంప్ చేయనప్పుడు ఇలా శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. శ్వాస లోపాలు, అసాధారణంగా ఊపిరి తీసుకోవడం, అదే సమయంలో ఛాతి నొప్పి ఉంటే అది హార్ట్ అటాక్‌కు సంకేతం, దీన్ని అస్సలు లైట్ తీసుకోవద్దు. ఇలాంటప్పుడు ఎమర్జెన్సీ ట్రీట్‌మెంట్ అవసరం అవుతుంది.
ఛాతీ మధ్యలో లేదా ఎడమ వైపు అసౌకర్యం
ఛాతీ మధ్యలో లేదా ఎడమ వైపు నొప్పి లేదా అసౌకర్యంగా ఉంటే, అలర్ట్ అవ్వాలి. ఇలాంటప్పుడు బాధితుల ఛాతీలో ఒత్తిడిగా, పిండేసినట్లు అనిపిస్తుంది. గుండె కండరాలకు ఆక్సిజన్ ఎక్కువగా ఉండే రక్త సరఫరా తగ్గిపోయినప్పుడు ఇలా జరుగుతుంది. ఈ అసౌకర్యం కొన్ని నిమిషాల కంటే ఎక్కువ ఉంటే లేదా తగ్గిపోయి మళ్లీ వస్తూ ఉంటే, వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి.
చేతులు, దవడ నొప్పి
శరీరంలో ఎడమవైపు భాగాలు.. అంటే ఎడమ చెయ్యి, వీపు, మెడ, దవడ లేదా కడుపు వరకు నొప్పి, తిమ్మిరి లేదా ఒత్తిడిగా ఉంటే జాగ్రత్త పడాలి. మీకు ఎక్కడ నొప్పిగా అనిపిస్తుందో గుర్తించండి. ఈ నొప్పి ఇతర భాగాలకు వ్యాపించడం, ఇది ఛాతీ నొప్పి లేదా శ్వాసలోపంతో కలిపి వస్తే.. అది హార్ట్ అటాక్ లక్షణం.
విపరీతమైన చెమట
పెద్దగా కష్టపడకపోయినా బాగా చెమట పడితే అనుమానించాలి. ఇది ఫిజికల్ వర్క్ చేసినప్పుడు లేదా వేడి నుండి వచ్చే సాధారణ చెమటలా కాకుండా చల్లగా, తేమగా ఉంటుంది. హృదయనాళ వ్యవస్థపై ఒత్తిడి పెరిగితే, దాన్ని ఎదుర్కోవటానికి శరీరం అధిక చెమటను ఉత్పత్తి చేస్తుంది. అంటే ఇది గుండెపోటు లక్షణంగా చెప్పుకోవచ్చు.
Also Read: తెలంగాణలో మరో రెండు రోజులు వానలే..వానలు!
ఉన్నట్టుండి అలసిపోవడం
ఎక్కువగా కష్టపడి పని చేయకపోయినా అసాధారణంగా అలసిపోయినట్లు లేదా బలహీనంగా అనిపిస్తే.. శరీరంలో ఏదో తేడాగా జరుగుతుందని అర్థం. గుండె సామర్థ్యం తగ్గితే, శరీరానికి అవసరమైన ఆక్సిజన్, పోషకాలు సరిగా అందవు. దీంతో ఉన్నట్టుండి విపరీతంగా అలసటగా అనిపిస్తుంది. అలాంటప్పుడు వెంటనే ట్రీట్‌మెంట్ చేయించాలి.