Punjab LS Polls 2024 : పంజాబ్ ఎన్నికల్లో ఇందిరాగాంధీ హంతకుడి కొడుకు!

రానున్న లోక్​సభ ఎన్నికల్లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హంతకుల్లో ఒకరైన బియాంత్‌ సింగ్‌ కుమారుడు పోటీ చేస్తున్నారు. పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌ స్థానం నుంచి ఈయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు.

New Update
Punjab LS Polls 2024 : పంజాబ్ ఎన్నికల్లో ఇందిరాగాంధీ హంతకుడి కొడుకు!

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హంతకుల్లో ఒకరైన బియాంత్‌ సింగ్‌ కుమారుడు సరబ్‌జీత్‌ సింగ్​ ఖల్సా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

45 ఏళ్ల సరబ్‌జీత్‌ గతంలో పలు ఎన్నికల్లో పోటీ చేశారు. 2004లో బఠిండా లోక్​సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో సరబ్​జీత్​కు 1,13,490 ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత 2007లో జరిగిన పంజాబ్‌ శాసనసభ ఎన్నికల్లో భదౌర్‌ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి చవిచూశారు. ఈ ఎన్నికల్లో సరబ్‌జీత్‌కు 15 వేలకుపైగా ఓట్లు దక్కాయి. 2009, 2014 సార్వత్రిక ఎన్నికల్లోనూ బఠిండా, ఫతేగఢ్‌ సాహిబ్‌ స్థానాల నుంచి బరిలో నిలిచారు. ఈ రెండు ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పాలయ్యారు.

2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో తనకు రూ.3.5 కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు సరబ్​జీత్​. ఇదిలాఉంటే ఈయన తల్లి బిమల్‌ కౌర్‌ ఖల్సా 1989లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రోపర్‌ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసి 4లక్షల ఓట్ల మెజరిటీతో గెలిచారు. ఇవే ఎన్నికల్లో ఆయన తాత, బియాంత్​ సింగ్​ తండ్రి సుచాసింగ్‌ కూడా బఠిండా స్థానం నుంచి విజయం సాధించారు. ఈయనకు 3 లక్షలకుపైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొంది పార్లమెంట్​లో అడుగుపెట్టారు.

ఫరీద్‌కోట్‌ బరిలో అభ్యర్థులు వీరే
ప్రస్తుతం సరబ్‌జీత్‌ సింగ్​ ఖల్సా పోటీ చేస్తున్న ఫరీద్‌కోట్‌ నియోజకవర్గానికి కాంగ్రెస్‌ ఎంపీ మహమ్మద్‌ సాదిఖ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి బీజేపీ తరఫున వాయవ్య దిల్లీ సిట్టింగ్‌ ఎంపీ, పంజాబీ జానపద, సినీ నేపథ్య గాయకుడు హన్స్‌రాజ్‌ హన్స్‌ పోటీ చేస్తున్నారు. ఇక ప్రముఖ కమెడియన్‌ కరంజీత్‌ అనుమోల్‌ను ఆమ్‌ఆద్మీ పార్టీ బరిలోకి దించింది. కాంగ్రెస్‌, శిరోమణి అకాలీదళ్‌ పార్టీలు ఇంకా తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించలేదు. అయితే కాంగ్రెస్​ నుంచి మళ్లీ ఎంపీ మహమ్మద్‌ సాదిఖ్‌కే టికెట్​ వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈయన కూడా ప్రముఖ పంజాబీ ఫోక్​ సింగర్​.

Indira Gandhi Assassination : 1984 అక్టోబరు 31న అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీని బియాంత్‌ సింగ్‌, సత్వంత్‌ సింగ్‌ తుపాకులతో కాల్చడం వల్ల ఆమె ప్రాణాలు కోల్పోయారు. కాగా, వీరు ఇందిరాగాంధీకి భద్రతా సిబ్బందిగా విధులు నిర్వర్తించేవారు.

Advertisment
తాజా కథనాలు