/rtv/media/media_files/2025/09/29/group-1-post-2025-09-29-20-04-50.jpg)
Group 1 Post
TG News: తండ్రి లేడు. తల్లి కూలి పనిచేసేది.. కుటుంబంలో ప్రతిరోజూ ఆర్ధిక ఇబ్బందులే! అయినప్పటికీ ఇవేవి తన లక్ష్యానికి అడ్డుకట్టలు అనుకోలేదు. తన కష్టాలనే ఆయుధంగా మార్చుకుంది. ''చదివితే జీవితం మారుతుంది'' అని తల్లిదండ్రులు చెప్పిన మాటలను గుండెల్లో పెట్టుకుంది. పట్టుదలతో తన లక్ష్యం వైపు అడుగులు వేసింది! చివరికి తన కష్టాలను ఆనందాలుగా మార్చుకుంది. ఇటీవలే విడుదలైన గ్రూప్ 1 ఫలితాల్లో 474 ర్యాంక్ సాధించి డీఎస్పీ ఉద్యోగం సాధించి.. తమ గ్రామానికే గర్వకారణంగా నిలిచింది మోదుంపల్లి మహేశ్వరి.
కష్టాల నుంచి విజయం వైపు ప్రయాణం
కరీంనగర్ జిల్లా, మానకొండూరు మండలంకు చెందిన మహేశ్వరి జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కుంటూ ఈ స్థాయికి చేరుకుంది. నాలుగు సంవత్సరాల క్రితం ఆమె తండ్రి లక్ష్మణ్ చనిపోయారు. అప్పటి నుంచి తల్లి శంకరమ్మ మహేశ్వరి బాధ్యతలు చూసుకుంటోంది. కూలి పని చేస్తూ, వచ్చిన కొద్ది డబ్బుతోనే బిడ్డను ఉన్నత చదువులకు పంపించి.. ఆమెలో ధైర్యాన్ని నింపింది.
చదువు వివరాలు
మహేశ్వరి తన ప్రాథమిక విద్యను రేకొండ ప్రభుత్వ పాఠశాలలో పూర్తి చేసింది. ఆ తర్వాత పదవ తరగతి వరకు కరీంనగర్ సాగర్ మెమోరియల్ హైస్కూల్ చదువుకుంది. పదవ తరగతిలో మంచి ఉతీర్ణతతో మండల్ టాపర్ గా నిలిచింది. ఇంటర్మీడియట్ లయోల జూనియర్ కాలేజ్, డిగ్రీ: కరీంనగర్ గవర్నమెంట్ డిగ్రీ మహిళా కళాశాల, పీజీ: గోదావరిఖని యూనివర్సిటీ పీజీ కాలేజ్‌లో ఎంఎస్సీ ఫిజిక్స్ పూర్తి చేసింది. ఆ తర్వాతే పోటీ పరీక్షలకు సిద్ధమైంది.
ఎన్నో ఆర్ధిక ఇబ్బందులు ఎదురైనా మహేశ్వరి మాత్రం తన చదువును ఆపలేదు. ఆమె చదువు మొత్తం కష్టాలతోనే గడిచింది. అద్దె ఇళ్ళలో చదువుకున్న రోజులు, కొత్త పుస్తకాలు కొనలేక పరిస్థితుల్లో పాత పుస్తకాలతో చదువుకోవడం, డబ్బును ఆదా చేసుకోవడానికి చేసిన త్యాగాలు ఆమెను మరింత దృఢంగా మార్చాయి. చదువుపై ఆమెకున్న నిబద్ధత, గురువుల ప్రోత్సాహం, ముఖ్యంగా తల్లి అందించిన మద్దతు వల్లే ఈరోజు ఈ ఉన్నత స్థాయికి చేరుకుంది.
గ్రామీణ అమ్మాయిలకు స్ఫూర్తి
ఈ సందర్భంగా మహేశ్వరి మాట్లాడుతూ, "నేను గ్రామీణ ప్రాంతం నుండి వచ్చినా, కష్టపడి చదివితే పెద్ద పెద్ద విజయాలు సాధించవచ్చు. నా ఈ విజయం మా గ్రామంలోని ఆడపిల్లలందరికీ స్ఫూర్తి కావాలి" అని చెప్పింది.ఈ గొప్ప విజయంపై గ్రామస్తులంతా ఆమె ఇంటికి వచ్చి అభినందనలు తెలిపారు. అలాగే ఆమెకు సన్మాన సత్కారాలు చేశారు. ఓపెన్ టాప్ జీపులో ఆమెను ఊరేగించారు.
Also Read: Bathukamma Celebrations: లండన్ లో మారుమోగిన బతుకమ్మ సంబరాలు.. ఆటపాటలతో కవిత సందడి! ఫొటోలు వైరల్