Protem Speaker of Telangana: తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. తొలి క్యాబినెట్ మీటింగ్ కూడా పూర్తయ్యింది. డిసెంబర్ 9వ తేదీన అసెంబ్లీ సమావేశం నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ రోజున అసెంబ్లీల్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే, కొత్త సభ్యులతో అసెంబ్లీలో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత కొత్త స్పీకర్‌ను ఎన్నుకొంటారు. ఇప్పటికే స్పీకర్ అభ్యర్థి పేరు ఖరారైంది. గడ్డం ప్రసాద్ కుమార్‌ను స్పీకర్‌గా ప్రకటించింది కాంగ్రెస్. ఇంతవరకు బాగానే ఉంది కానీ.. ప్రొటెం స్పీకర్ ఎవరు? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
వాస్తవానికి ఎంతో కాలంగా వస్తున్న సంప్రదాయం ప్రకారం.. ప్రొటెం స్పీకర్‌గా సీనియర్ ఎమ్మెల్యేలను నియమిస్తారు. ఈ లెక్కన చూసుకుంటే.. సీనియారిటీ ప్రకారం మాజీ సీఎం కేసీఆర్ ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించాల్సి ఉంటుంది. కేసీఆర్ ఇప్పటి వరకు ఎనిమిదిసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆయన తరువాతి స్థానంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి, దానం నాగేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. ఎంఐఎంకు చెందిన అక్బరుద్దీన్ కూడా ఎమ్మెల్యేగా ఆరుసార్లు ఎన్నికయ్యారు. మరి వీరిలో ఎవరు ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
ప్రొటెం స్పీకర్‌గా కేసీఆర్ ఓకే అంటారా?
వాస్తవానికి డిసెంబర్ 9న అంటే శనివారమే అసెంబ్లీ సమావేశం జరుగనుంది. శాసనసభ సభ్యులందరూ సభా వేదికగా రేపు ప్రమాణ స్వీకారం చేస్తారు. మరోవైపు కేసీఆర్ కాలు జారి కింద పడటంతో తీవ్రంగా గాయపడ్డారు. ఆయన ప్రస్తుతం యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇలాంటి తరుణంలో ఆయన అసెంబ్లీకి హాజరవడం కష్టమనే చెప్పాలి. సీనియార్టీ లిస్ట్‌లో కేసీఆర్ తరువాతి స్థానంలో ఉన్న పోచారం శ్రీనివాస్ రెడ్డే ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించే అవకాశం కనిపిస్తోంది. ఆయన ఇప్పటికే స్పీకర్‌గా ఉన్నారు. 2019లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తరువాత అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. దాదాపు ఈయనే ప్రొటెం స్పీకర్‌గా ఎంపికయ్యే అవకాశం కనిపిస్తోంది. మరి రేపు అసెంబ్లీలో ఏం జరుగుతుందో చూడాలి.
Also Read:
నేడు ఉదయం విద్యుత్ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!!