రైతు రుణమాఫీపై రేవంత్ సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. నిన్న గైడ్ లైన్స్ ప్రకటించిన ప్రభుత్వం.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 18న రూ.లక్ష వరకు రుణాలను మాఫీ చేయనున్నట్లు ప్రకటించింది. ఆ రోజు సాయంత్రంలోగా రైతుల రుణఖాతాల్లో డబ్బులను జమ చేయనున్కన. అదే రోజు రైతు వేదికల్లో రుణమాఫీ లబ్ధిదారులతో కలిసి సంబరాలు నిర్వహించాలని నిర్ణయించింది.
ఈ సంబరాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది ప్రభుత్వం. రుణమాఫీ కోసం ప్రభుత్వం విడుదల చేసిన నిధులను ఇతర ఖాతాల్లో జమచేసుకుంటే బ్యాంకర్ల పైన కఠిన చర్యలు ఉంటాయని రేవంత్ సర్కార్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.
తెలంగాణ రైతు రుణమాఫీకి రేషన్ కార్డు నిబంధన పెట్టడంపై కొంత మంది రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. రేషన్ కార్డు లేని వారు తమకు రుణమాఫీ కాదేమోనని టెన్షన్ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రూల్ పై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. భూమి పాస్ బుక్ ఆధారంగానే కుటుంబానికి రూ.2లక్షల పంట రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. కేవలం కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డు నిబంధన తీసుకొచ్చామని తెలిపారు. మంగళవారం కలెక్టర్ల సదస్సులో ఈ విషయంపై ఆయన కీలక ప్రకటన చేశారు.