టీఎస్పీఎస్సీ (TSPSC) ఛైర్మన్, సభ్యుల రాజీనామాలను ఈ రోజు గవర్నర్ ఆమోదించారు. దీంతో సాధ్యమైనంత త్వరగా కొత్త ఛైర్మన్ ను నియమించి నోటిఫికేషన్ల విడుదల ప్రారంభించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు ప్రారంభిస్తోంది. ఈ నేపథ్యంలో TSPSC కొత్త ఛైర్మన్ ఎవరనే దానిపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. మరో వారం రోజుల్లోనే కొత్త ఛైర్మన్ ను నియమించే అవకాశం ఉంది. అయితే.. TSPSC ఛైర్మన్ రేసులో మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి(Akunuri Murali), ఐఏఎస్‌లు అనితా రామచంద్రన్, శైలజా రామయ్యర్, వాణి ప్రసాద్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ గెలుపు కోసం బ్యాక్ ఎండ్‌లో ఆకునూరి మురళి పని చేశారు.
ఇది కూడా చదవండి: TSPSC: టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలకు గవర్నర్ ఆమోదం.. నోటిఫికేషన్లకు లైన్ క్లీయర్
గతంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ, విద్యారంగ సమస్యలపై ఆయన పోరాటం చేశారు. రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన గళం విప్పారు. దీంతో టీఎస్పీఎస్సీ ఛైర్మన్ గా ఆయనే సరైన వ్యక్తి అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం టీఎస్పీఎస్సీ సెక్రటరీగా అనితా రామచంద్రన్ పేరు ఉన్నారు. ఇప్పటికే టీఎస్పీఎస్సీ లో పని చేసిన అనుభవం ఉన్న ఈ ఐఏఎస్ ఆఫీసర్ కు ఛైర్మన్ గా బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందన్న ఆలోచనను కూడా ప్రభుత్వం చేస్తోందని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: TS Govt Jobs : ఆ ఉద్యోగ ఖాళీల భర్తీపై రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు!
కొత్త వారిని ఛైర్మన్ గా నియమిస్తే వారు అక్కడి పరిస్థితులను అర్థం చేసుకోవడానికి సమయం పడుతుందని.. వెంటనే నోటిఫికేషన్ల విడుదలను ప్రారంభించాలంటే అనితా రామచంద్రన్ అయితే కరెక్ట్ అన్న భావన ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తం అవుతున్నట్లు సమాచారం. ఇంకా విద్యారంగంలో అపార అనుభవం కలిగిన ప్రొఫెసర్ కోదండరాం పేరు కూడా టీఎస్పీఎస్సీ ఛైర్మన్ లిస్ట్ లో వినిపించినా.. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని ఎన్నికల సమయంలో చెప్పినట్లుగా చర్యలు ప్రారంభించింది రేవంత్ సర్కార్. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి యూపీఎస్సీ ఛైర్మన్ తో భేటీ అయ్యారు. నియామకాల్లో వారు అవలంభిస్తున్న విధానాలను అడిగి తెలుసుకున్నారు. వచ్చే నెలలో గ్రూప్-1తో పాటు మరికొన్ని ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తాము అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.