బీజేపీ ఫైర్‌బ్రాండ్‌గా రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న వ్యక్తి రఘునందన్‌రావు (Raghunandan Rao). బీఆర్ఎస్ కంచుకోటలైన సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ నియోజకవర్గాలకు అత్యంత సమీపంలో ఉన్న దుబ్బాక ఉపఎన్నికలో అనూహ్యంగా బీజేపీ జెండా పాతి సంచలనం సృష్టించారు ఆయన. తరచూ టీవీ డిబేట్లలో పాల్గొంటూ, వాగ్ధాటితో ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టగల సమర్థుడిగా పేరుపొందిన వకీల్ సాబ్ కీలకమైన ఈ ఎన్నికల సమయంలో స్థాయికి తగ్గట్టు క్రియాశీలకంగా లేరన్నది విశ్లేషకుల పరిశీలన. పార్టీ భావజాలాన్ని బలంగా వ్యాప్తి చేయగల చరిష్మా ఉన్నప్పటికీ ఆయన తన నియోజకవర్గం దాటి తిరగకపోవడం ఇంటాబయటా చర్చనీయమవుతోంది.
ఇది కూడా చదవండి: TS Politics: బీజేపీ ప్రచారంలో కనిపించని రాములమ్మ.. కారణమిదేనా?
హోరాహోరీ పోరు తప్పదన్న అంచనాల నేపథ్యంలో దుబ్బాక నియోజకవర్గం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. బీజేపీ నుంచి రఘునందన్ రావు పోటీ చేస్తుండగా, కొత్త ప్రభాకరరెడ్డి బీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాస రెడ్డి రెండో సారి తలపడుతున్నారు. రామలింగారెడ్డి మృతి అనంతరం జరిగిన ఉప ఎన్నికలో స్వల్ప తేడాతో రఘునందనరావు విజయం సాధించగా, ఈ దఫా పోరు రసవత్తరంగా జరగనుంది. ఈ స్థానాన్ని ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న బీఆర్ఎస్ మెదక్ ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకరరెడ్డిని రంగంలోకి దింపింది.
ఇది కూడా చదవండి: Kishan Reddy: ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తాం.. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
ఎలాగైనా ఆ స్థానాన్ని కైవసం చేసుకోవడంతో పాటు రఘునందనరావు దూకుడుకు కళ్లెం వేయాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రచారాన్ని ముమ్మరం చేసింది. గెలిచిన తర్వాత నియోజకవర్గానికి చేసిందేమీ లేదని ప్రజల్లోకి వెళ్తూ రఘునందనరావును ఆత్మరక్షణలో పడేసే ప్రయత్నం చేస్తోంది. మాటలతో అధికారపక్షాన్ని ఇరుకున పెట్టే రఘునందనరావును ఆ ఒక్క చోటుకే పరిమితం చేస్తే మిగతా స్థానాల్లోనూ అది లాభిస్తుందని గులాభీనేతలు భావిస్తున్నారు. అంతలోనే ప్రభాకరరెడ్డిపై జరిగిన దాడి కూడా రాష్ట్ర రాజకీయాల్లో అలజడి రేపింది. ఇవి హత్యారాజకీయాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించడంతో రాష్ట్రమంతా దుబ్బాకవైపు చూసింది.
ఇదిలా ఉంటే ఆ పార్టీలో అసంతృప్త రాజకీయాలపై కూడా ప్రజలు చర్చించుకుంటున్నారు. బీసీ సీఎం ప్రకటన; ఇటీవలే పలువురు నాయకుల వ్యాఖ్యలతో బీజేపీలో విభేదాలు బయటపడ్డ నేపథ్యం; అంతలోనే కీలక నేతలు కొందరు కమల దళాన్ని వీడడం వంటి అంశాలు కార్యకర్తలను ఒత్తిడికి గురిచేశాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ ప్రకటించిన స్టార్ కాంపేయినర్ల తొలి జాబితాలో ఆశ్చర్యకరంగా రఘునందన్ పేరు లేకపోవడం ఆయన అనుచరులను నిరాశకు గురిచేసింది.
రెండో సారి కూడా గెలిచి మరో సారి అసెంబ్లీలో అడుగుపెట్టాలన్న లక్ష్యంతోనే రఘునందన్ నియోజకవర్గం దాటి బయటకు రావడం లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై రఘునందన్ అసంతృప్తితో ఉన్నారని.. అందుకే ఇతర నియోజకవర్గాల్లో ప్రచారానికి వెళ్లడం లేదన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో సాగుతోంది.