/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Patel-Ramesh-Reddy-2-jpg.webp)
సూర్యాపేటలో కాంగ్రెస్ రెబల్ గా బరిలోకి దిగిన పటేల్ రమేష్ రెడ్డి (Patel Ramesh Reddy) తన నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు. కాంగ్రెస్ నేతలు రోహిత్ చౌదరి, మల్లు రవి ఈ రోజు ఉదయం సూర్యాపేటలోని రమేష్ రెడ్డి నివాసానికి వెళ్లి చర్చలు జరిపాయి. దీంతో తాను పోటీలో నుంచి తప్పుకుంటున్నట్లు రమేష్ రెడ్డి ప్రకటించారు. కొద్ది సేపటి క్రితం నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు. దామోదర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేస్తానని ఆయన ప్రకటించారు. అయితే.. ఈ రోజు ఉదయం పటేల్ రమేష్ రెడ్డికి నివాసానికి వచ్చిన రోహిత్ చౌదరి, మల్లు రవిని కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.
ఇది కూడా చదవండి: నేను ఇంకా ఎంతకాలం కొట్లాడాలి.. బోధన్ సభలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు!
నామినేషన్ ఉపసంహరించుకోవడానికి రమేష్ రెడ్డి వెళ్లే సమయంలోనూ కార్యకర్తలు రమేష్ రెడ్డిని అడ్డుకున్నారు. నామినేషన్ ఉపసంహరించుకోవద్దని డిమాండ్ చేశారు. దీంతో ప్రత్యేక బలగాల సహకారంతో ఆయన సూర్యాపేట ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి తన నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను చాలా దురదృష్టవంతుడినని.. 30 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నా ఫలితం లేదని కన్నీరు పెట్టుకున్నారు. ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశం కూడా లేకుండా పోయిందని భావోద్వేగానికి గురయ్యారు. నల్గొండ ఎంపీగా అవకాశం కల్పిస్తామని రేవంత్ రెడ్డితో పాటు హైకమాండ్ పెద్దల నుంచి హామీ లభించిందని చెప్పారు.
ఈ రోజు నామినేషన్ల విత్ డ్రా సందర్భంగా అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. స్వతంత్రులు, రెబల్స్ తో ప్రధాన పార్టీల అభ్యర్థులు చర్చలు జరిపి వారు నామినేషన్లను ఉపసంహరించుకునేలా చేసే ప్రయత్నం చేశారు. తాజాగా జూబ్లీ హిల్స్ ఎన్నికల బరిలో నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన నవీన్ యాదవ్ కూడా పోటీ నుంచి తప్పుకున్నారు. ఆయన కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ ను మద్దతు ప్రకటించే అవకాశం ఉంది. రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి వచ్చిన అజారుద్దీన్ నవీన్ యాదవ్ తో చర్చలు జరిపారు.