Jagtial Elections: గెలుపు నీదా నాదా సై.. జగిత్యాలలో తగ్గేదే లే అంటున్న ఆ ముగ్గురు..! జగిత్యాలలో ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. ఇన్నేళ్లు ద్విముఖ పోరు మాత్రమే ఉండగా.. ఇప్పుడు త్రిముఖ పోరు సాగనుంది. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, జీవన్ రెడ్డిలకు పోటీగా భోగ శ్రావణి పోటీకి సై అన్నారు. జగిత్యాల ఎన్నికల బరిలో బీజేపీ తరఫున ఆమె నిలిచారు. By Shiva.K 11 Nov 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Jagtial Assembly Constituency Biography: తెలంగాణలో పోలింగ్‌కు మరో 19 రోజుల సమయం మాత్రమే మిగిలింది. ఆయా నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల నేతల తమ ప్రచారంలో దుమ్ము రేపుతున్నారు. ప్రత్యర్థులపై విమర్శల వాక్భాణాలు సంధిస్తున్నారు. తమ మాటల ధాటితో పొలిటికల్ హీట్‌ను పెంచేస్తున్నారు. అదే సమయంలో ఎన్నికల్లో గెలవాలంటే ఒక్క ప్రచారం మాత్రమే సరిపోదు.. పొలరైజేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓట్ల లెక్కలు, ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు నేతలు చేసే జిమ్మిక్కులతో తెలంగాణ రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. ప్రస్తుతం తెలంగాణలో జగిత్యాల నియోజకవర్గంలో ఇంట్రస్టింగ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఇప్పటి వరకు రెండు పార్టీల మధ్యే పోరు ఉండగా.. ఇప్పుడు మరో పార్టీ దూసుకొచ్చింది. అదే బీజేపీ. బీఆర్ఎస్ పార్టీ నుంచి డాక్టర్ సంజయ్ కుమార్ మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక బీజేపీ నుంచి జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి పోటీ చేస్తున్నారు. దాంతో జగిత్యాలలో ఈసారి త్రిముఖ పోరు చాలా టఫ్‌గా కనిపిస్తోంది. మరి జగిత్యాల ఎన్నికల బరిలో ఉన్న ఈ ముగ్గురు నేతల ప్రొఫైల్ ఏంటో ఓసారి చూద్దాం.. సంజయ్ కుమార్.. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాకునూరు సంజయ్ కుమార్ 1989లో విజయవాడలోని సిద్దార్థ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. కొద్ది కాలం జగిత్యాలలో డాక్టర్ గా ప్రాక్టీస్ చేసి.. 1992లో కర్ణాటకలోని జేజేఎం మెడికల్ కాలేజీలో ఆప్తమాలజీలో ఎంఎస్- పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసారు. ఆ తరువాత తిరిగి జగిత్యాల వచ్చి డాక్టర్ గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. తెలంగాణపై అభిమానంతో ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. అదే సమయంలో కేసీఆర్ కోరడంతో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మొదటిసారిగా 2014లో నాటి టీఆర్ఎస్(ఇప్పుడు బీఆర్ఎస్) తరఫున జగిత్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ సీనియర్ నేత టీ జీవన్ రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత 2018 ఎన్నికల్లో అదే జీవన్ రెడ్డిపై పోటీ చేసి 60,774 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇప్పుడు మూడోసారి పోటీ చేస్తున్నారు సంజయ్ కుమార్. ఈసారి కూడా విజయం తనదే అనే ధీమాతో ఉన్నారు సంజయ్ కుమార్. ప్రభుత్వ పథకాలు, తాను చేసిన అభివృద్ధి పనులే తనను మరోసారి గెలిపిస్తాయనే ధీమాతో ఉన్నారు సంజయ్. జీవన్ రెడ్డి.. జీవన్ రెడ్డి జగిత్యాల నుండి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మూడుసార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా పని చేశారు. 1983లో టీడీపీ తరుఫున తొలిసారి గెలిచారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా, నాదెండ్ల భాస్కరరావు మంత్రివర్గంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా పని చేశారు. ఎన్‌టీ రామారావు 1985లో ప్రభుత్వాన్ని రద్దు చేయడంతో తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. 1985లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. జీవన్ రెడ్డి 1989లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై, 1994లో ఓడిపోయి 1996 ఉప ఎన్నికలో గెలిచి 1999, 2004లో జరిగిన ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించారు. 2004 -2009 మధ్య వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా పని చేశారు. 2006, 2009లో కరీంనగర్ లోక్‌సభ స్థానం నుండి పోటీ చేసి ఓడిపోయారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో జగిత్యాల అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా రికార్డుకెక్కారు. 2018లో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి 2019లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుండి గెలిచారు. ఇప్పుడు అదే జగిత్యాల నియోజకవర్గం నుంచి మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. యితే ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు తనకు చివరి ఎన్నికలంటూ.. సానుభూతిని పొందే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి. మరి ఆయన సెంటిమెంట్ పాలిటిక్స్ వర్కౌట్ అవుతాయా? లేదా? అనేది ఎన్నికల ఫలితాలు వచ్చాకే తెలుస్తుంది. ఇదిలాంటే.. జగిత్యాల నియోజకవర్గంలో ప్రతిసారి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యనే ప్రధాన పోరు ఉండేది. కానీ, ఇప్పుడు ఈ రెండు పార్టీలకు తోడుగా బీజేపీ దూసుకొచ్చింది. సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌తో విభేదించిన మున్సిపల్ చైర్మన్ భోగ శ్రావణి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. వాస్తవానికి ఎమ్మెల్యే టికెట్ ఆశించే ఆమె బీజేపీలో చేరారనే ప్రచారం ఉంది. బీజేపీ కూడా జగిత్యాల టికెట్‌ను ఆమెకే ఖరారు చేసింది. దీంతో జగిత్యాలలో ఈసారి త్రిముఖ పోరు కన్ఫామ్ అయిపోయింది. వాస్తవానికి జగిత్యాలలో పద్మశాలీల ఓట్లు కొంచెం ఎక్కువగానే ఉంటాయి. శ్రావణి సామాజిక వర్గం కూడా పద్మశాలినే. అందుకే గెలుపుపై శ్రావణి చాలా ధీమాగా ఉంది. అదే విధంగా నియోజకవర్గంలో మహిళల ఓట్లను సైతం తనవైపునకు లాగే ప్రయత్నం చేస్తోంది శ్రావణి. మొత్తానికి జగిత్యాలలో గెలిచేందుకు ఇలా ఎవరి ప్రయత్నాలను వారు ముమ్మరం చేశారు. నియోజకవర్గంలో త్రిముఖ పోరు చాలా టఫ్‌గా కనిపిస్తన్నప్పటికీ.. గెలుపుపై ఎవరికి వారు చాలా ధీమాగా ఉన్నారు. మరి నియోజకవర్గం ప్రజలు ఎలాంటి ఫలితం ఇస్తారనేది తేలాలంటే డిసెంబర్ 3వ తేదీ వరకు ఎదురు చూడాల్సిందే. Also Read: ప్రధాన పార్టీలకు రెబల్స్ గండం.. బుజ్జగింపులు షురూ చేసిన అగ్రనేతలు.. ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తున్నారు? పార్టీల వారీగా వివరాలు.. #jagtial-assembly-constituency-biography మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి