Ponguleti Srinivas Reddy: మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) మెడకు పొత్తుల కత్తి వేలాడుతోంది. కామ్రేడ్లతో కాంగ్రెస్ పొత్తు ఖరారు అవ్వడంతో పొంగులేటికి షాక్ తగిలినట్టు అయ్యింది. వామపక్షాలకు పొంగులేటి అనుచరుల సీట్లు ధారాదత్తం చేసినట్టు సమాచారం. సీపీఐ (CPI) కు కొత్తగూడెం, చెన్నూరుతో పాటు సీపీఎం (CPM)కు మిర్యాలగూడ సీట్లు ఇస్తున్నట్టు తెలుస్తోంది. వైరా స్థానంపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. మరోవైపు తన అనుచరుల సీట్లు కోసం పొంగులేటి పట్టుబడుతుండగా.. అది కుదరదని అధిష్టానం తేల్చేసింది.
ఏం చేయాలి?
కమ్యూనిస్టులకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీట్లు కేటాయిస్తుండడంతో పొంగులేటి (Ponguleti) అనుచరులు డైలమాలో ఉండిపోయారు. కొత్తగూడెం కాంగ్రెస్ అభ్యర్థిత్వాన్ని పొంగులేటి అనుచరుడు ఊకంటి గోపాలరావు ఆశించారు. అటు వైరా కాంగ్రెస్ అభ్యర్థిత్వాన్ని విజయాభాయ్ ఆశించారు. చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థిత్వాన్ని డాక్టర్ రాజా రమేశ్ ఆశించగా.. మిర్యాలగూడ అభ్యర్థిత్వాన్ని లక్ష్మారెడ్డి ఆశించారు. ఇప్పుడు వీరికి సీటు దక్కుతుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. ఇక కామ్రేడ్లతో పొత్తుపై రేపు(అక్టోబర్ 22) అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు (Thummala), సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తమ మద్దతుదారులకు టిక్కెట్ల కోసం ప్రయత్నిస్తుండగా.. టీపీసీసీ సీపీఐకి, సీపీఎంకు సీట్లు ఇవ్వాలని డిసైడ్ ఐనట్టుగా తెలుస్తోంది. అటు ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ టికెట్లు ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండగా కేవలం మూడు జనరల్ స్థానాలు మాత్రమే అక్కడ ఉన్నాయి. పాలేరు, ఖమ్మం, కొత్తగూడెం మూడు జనరల్ స్థానాలు. ఐదు స్థానాలు ఎస్టీలకు, రెండు ఎస్సీలకు రిజర్వ్ చేసి ఉన్నాయి. అటు సీపీఐ, సీపీఎంలకు రెండేసి టిక్కెట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరించినట్లు సంకేతాలు అందుతున్నాయి. నల్గొండ జిల్లాల్లో కూడా వామపక్షాలు సీట్లు అడుగుతున్నట్టుగా తెలుస్తోంది. నల్గొండలోని మునుగోడు, ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెంలను సీపీఐ కోరుతోంది. ఖమ్మంలోని భద్రాచలం, నల్గొండ జిల్లా మిర్యాలగూడ కావాలని సీపీఎం కోరుతోంది. భద్రాచలంలో ఇప్పటికే కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే పొడెం వీరయ్య ఉన్నారు. సిట్టింగ్ సీటు ఇవ్వకుంటే వీరయ్యకు మరో సీటు కల్పించాల్సి ఉంటుంది.