టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) పార్టీ ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. స్కిల్ డవలప్మెంట్ కేసు, చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest), క్వాష్ పిటిషన్ కొట్టివేత, సీఐడీ విచారణ తదితర అంశాలపై ఆయన చర్చిస్తున్నారు. లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రను (Yuvagalam Padayathra) మళ్లీ ప్రారంభించే అంశంపై ఈ సందర్భంగా చర్చ జరిగింది. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా.. చంద్రబాబుపై అవినీతి మరక వేయలేకపోయిందని ఈ సందర్భంగా పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు. వచ్చే వారంలో తన యువగళం యాత్రను మళ్లీ ప్రారంభించనున్నట్లు ఈ సందర్భంగా లోకేష్ ముఖ్య నేతలతో చెప్పినట్లు తెలుస్తోంది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలోని పొదలాడలో లోకేష్ పాదయాత్ర నిలిచిపోయింది. మళ్లీ అక్కడి నుంచే తన పాదయాత్రను తిరిగి ప్రారంభించాలని లోకేష్ భావిస్తున్నట్లు తెలస్తోంది. పాదయాత్రతో పాటు చంద్రబాబుపై కేసుల విషయంలో న్యాయ పోరాటం కొనసాగించాలని లోకేష్ నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం లోకేష్ ఢిల్లీలో ఉన్నారు. చంద్రబాబు సీఐడీ కేసు అంశంపై ఆయన లాయర్లతో చర్చలు జరుపుతున్నారు.
ఇదిలా ఉంటే.. చంద్రబాబును రెండో రోజు కూడా సీఐడీ తన కస్టడీలోకి తీసుకుని విచారణ జరుపుతోంది. ఈ రోజు ఉదయం 10 గంటలకు సీఐడీ అధికారులు విచారణ ప్రారంభించారు. మొత్తం 60 ప్రశ్నలు ఈ రోజు అడగాలని సీఐడీ నిర్ణయించుకుందని సమాచారం. చంద్రబాబు చెప్పిన సమాధానాలతో సంతృప్తి చెందకపోతే కస్టడీని పొడిగించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. అయితే.. లోకేష్ ను కూడా అరెస్ట్ చేస్తారని నిన్నటి వరకు ప్రచారం సాగినా ప్రస్తుతం ఆ వాతావరణం కనిపించడం లేదు.
మరో వైపు చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ నుంచి ఐటీ ఉద్యోగులు రాజమండ్రికి కార్ల ర్యాలీగా బయలుదేరారు.
ఇది కూడా చదవండి:
Chandrababu CID Interrogation Day-2: చంద్రబాబు రెండో రోజు సీఐడీ విచారణ ప్రారంభం.. ఈరోజు అడిగే ప్రశ్నలివే?