ప్రతి భక్తుడికి ఊతకర్ర.. తిరుమలలో నడక భక్తులకు కొత్త రూల్స్

భక్తుల భధ్రతపై తిరుపతి పద్మావతి అతిధి గృహంలో జరిగిన హై లెవెల్ కమీటి సమావేశంలో టీటీడీ అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇకపై నడక మార్గంలో వెళ్లే ప్రతి భక్తుడికి ఊతకర్ర ఇవ్వనున్నారు.

New Update
ప్రతి భక్తుడికి ఊతకర్ర..  తిరుమలలో  నడక భక్తులకు కొత్త రూల్స్

తిరుమల నడకమార్గంలో టీటీడీ కొత్త రూల్స్ ప్రకటించింది. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన తిరుపతి పద్మావతి అతిధి గృహంలో జరిగిన హై లెవెల్ కమీటి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ వివరాలను భూమన తెలియజేశారు. నడక‌దారిలో నెలన్నర క్రితం‌ కౌశిక్ అనే బాలుడిపై, ఇటీవల చిన్నారి లక్షితపై చిరుత దాడుల నేపథ్యంలో అప్రమత్తమయ్యామని తెలిపారు.

భవిష్యత్తులో కాలినడకన, ఘాట్ రోడ్డులో వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అటవీశాఖ అధికారులతో చర్చలు జరిపామన్నారు. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకే పిల్లలను అనుమతి ఇస్తామన్నారు. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత చిన్నపిల్లలను అనుమతించే ప్రసక్తే లేదని తెలిపారు. రాత్రి పది గంటల వరకు పెద్దలకు నడక మార్గంలో అనుమతి ఉంటుందని పేర్కొన్నారు.

ఘాట్ రోడ్డులో సాయంత్రం 6 గంటల వరకే అనుమతి 

నడక మార్గంలో వెళ్లే ప్రతి భక్తుడికి ఊతకర్ర ఇస్తామని  కరుణాకర్ రెడ్డి   తెలిపారు. అలిపిరి నుండి ఘాట్ రోడ్డులో వెళ్లే ద్విచక్ర వాహనదారులకు ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకే అనుమతి ఇస్తామన్నారు. భక్తుల భధ్రత దృష్ట్యా ఎక్కువ మంది అటవీశాఖ సిబ్బందిని‌ నియమించుకుంటామని పేర్కొన్నారు. భక్తులను గుంపులుగా నడక మార్గంలో పంపేందుకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

తినుబండారాలు ఇవ్వకూడదు...   వ్యర్థపదార్థాలు బయట పారేయకూడదు

ఇక నుంచి నడక మార్గంలో, ఘాట్ రోడ్డులో భక్తులు సాధు జంతువులకు తినుబండారాలు ఇవ్వకుండా చూస్తామని.. అలాగే నడక దారిలోని హెటల్స్ నిర్వాహకులు వ్యర్థ పదార్థాలను బయట పారవేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దాదాపు 500 ట్రాప్ కెమెరాలను ఉపయోగిస్తున్నామని.. అవసరం అయితే డ్రోన్ కెమెరాలను కూడా ఉపయోగించాలని నిర్ణయం తీసుకున్నామని వివరించారు. నడక దారిలో ఫోకస్ లైట్స్ ఉంచాలని ఏర్పాటుచేస్తామన్నారు. కేంద్ర అటవీ శాఖ అధికారులతో ఫెన్సింగ్ ఏర్పాటుపై చర్చిస్తామని భూమన వెల్లడించారు.

15 వేల మందికి దివ్య దర్శనం టోకెన్లు

అలిపిరి, గాలిగోపురం, 7వ మైలు వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. భక్తుల ప్రాణరక్షణే ప్రథమ ధ్యేయంగా ఈ నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. 2007లో తాను చైర్మన్‌గా ఉన్నప్పుడు కాలినడక మార్గంలో వెళ్లే భక్తులకు టోకెన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని గుర్తుచేశారు. ప్రస్తుతం 15 వేల మందికి దివ్య దర్శనం టోకెన్లు ఇస్తున్నామన్నారు. దివ్యదర్శ‌నం టోకెన్లు తీసుకున్న భక్తులు ఏవిధంగానైనా తిరుమలకు చేరుకోవచ్చని సూచించారు.

వన్యమృగాల సంచారం తగ్గుముఖం‌ పట్టే వరకూ ఇవే నిబంధనలు అమలు చేస్తామన్నారు. వన్యప్రాణుల అధ్యాయనం కోసం ఫారెస్టు అధికారులకు అన్ని విధాలుగా సహకరిస్తామని.. భక్తులు సురక్షితంగా తిరుమలకు వచ్చేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని భూమన స్పష్టంచేశారు. దయచేసిన భక్తులు సహకరించాల్సిందిగా ఆయన కోరారు.

Advertisment
తాజా కథనాలు