YCP MLA Arani Srinivasulu : చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు(Arani Srinivasulu) జనసేన(Janasena) లో చేరారు. ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు జనసేనాని పవన్ కళ్యాణ్(Pawan Kalyan). ఎమ్మెల్యేతో పాటు మరి కొంత మంది వైసీపీ(YCP) కార్పొరేటర్లు జనసేన పార్టీలో చేరారు. కాగా, శ్రీనివాసులు 2009లో ప్రజారాజ్యం, 2014లో వైసీపీ తరుఫున పోటీ చేసి ఓడిపోయారు. 2019లో మళ్లీ వైసీపీ నుంచి బరిలోకి దిగి గెలుపొందారు. అయితే, వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ నిరాకరించిన వైసీపీ.. విజయానంద రెడ్డిని ఇన్ఛార్జ్ గా నియమించింది. ఈ క్రమంలో శ్రీనివాసులు వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరారు.
భాగస్వామ్యం కావాలి..
ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ఆరణి శ్రీనివాసులు జనసేనలో చేరడం ఆనందంగా ఉందన్నారు. 2008 నుంచి శ్రీనివాసులు తనకు పరిచయం అని.. ప్రజా సమస్యలపై ఎప్పుడూ స్పందించే వారని తెలిపారు. పదవులు, సీట్లు కోరకుండా నేడు పార్టీలో చేరారని వెల్లడించారు. రాయలసీమ అభివృద్ధిలో మనం భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
వ్యూహంతో…
ప్రాణాలకు తెగించి తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. గూండాయిజం, రౌడీ యిజానికి భయపడే వ్యక్తిని కానన్నారు. మూర్ఖత్వంతో కాకుండా వ్యూహంతో ముందుకు సాగుతానని చెప్పుకొచ్చారు. నేడు వైసీపీ ఎమ్మెల్యేలు అక్కడ ఉండలేక మన దగ్గరకి వస్తున్నారన్నారు. అనేక మంది వేదన, వ్యధతో బయటకి వస్తున్నారని వ్యాఖ్యానించారు. రాయలసీమలో 2008లో ఉన్న తెగింపు.. 2024కు లేదని పేర్కొన్నారు. ఆ భయాన్ని తెంచుకుని శ్రీనివాసులు మనతో వచ్చారన్నారు.
ఇంకా ఎంతకాలం
వైసీపీ అడ్టు అదుపు లేని దోపిడీకి తెర లేపిందని విమర్శలు గుప్పించారు. పింక్ డైమండ్ పై రమణ దీక్షితులు భిన్న వాదనలు వినిపించారని..అప్పుడు అన్యాయం అన్న వారు..జగన్ వచ్చాక అదే న్యాయం ఎలా అయ్యిందని ప్రశ్నించారు. రాయలసీమలో కూడా ఇప్పుడు ఇదే పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకొచ్చారు. యువత మొత్తం కూర్చుని ఉమ్మడి అభిప్రాయంతో వ్యూహం సిద్దం చేయండని పిలుపునిచ్చారు. ఒక తల్లి, ఒక సోదరి, ఒక సోదరుడు, యువత, రైతు ఇలా అందరి కన్నీళ్లు చూసి చలించి రాజకీయాల్లోకి వచ్చానన్నారు. మరొక్కసారి వైసీపీ వస్తే.. ఏపీలో ఉద్యోగం మరచిపోండని.. పొట్ట చేత పట్టుకుని దేశ, విదేశాలకు వెళ్లడం ఖాయమని అన్నారు. ఇంకా ఎంతకాలం బానిస సంకెళ్లతో బతకాలి ఆలోచన చేయండన్నారు. జగన్ ను తిట్టనక్కర్లేదని.. అక్రమాలను నిలదీయండిని సూచించారు.