Tollywood Celebrities : 2023 ఈ ఏడాది సినిమా ఇండస్ట్రీ గొప్ప గొప్ప విజయాలను అందుకుంది. తెలుగు సినిమా ఆస్కార్ స్థాయికి వెళ్ళడం.. టాలీవుడ్(Tollywood) చిత్ర పరిశ్రమకు ప్రపంచ స్థాయిలో గుర్తింపును తెచ్చింది. టాలీవుడ్ నటులు ఆస్కార్ స్టేజ్ పై అవార్డు తీసుకోవడం తెలుగు సినిమా ఖ్యాతిని మరింత పెంచింది. అంతే కాదు అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న మొదటి తెలుగు హీరో. కానీ ఇదే సమయంలో ఎంతో మంది దిగ్గజ నటుల మరణం సినీ ఇండీస్ట్రీలో కోల్పోయింది. ఫ్యాన్స్‌కు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తమిళనటుడు విజయకాంత్, కళాతపస్వి కె. విశ్వనాథ్, శరత్ బాబు, జమున, చంద్రమోహన్, సహా ఎంతో మంది విలక్షణ నటులు మరణించారు. నూతన సంవత్సరంలో అడుగుపెడుతున్న వేళ చిత్ర పరిశ్రమకు ఎన్నో మధుర జ్ఞాపకాలను అందించిన ఈ గొప్ప నటులను మరో సారి గుర్తు చేసుకుందాం.
కళాతపస్వి కె. విశ్వనాథ్
కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్(K Viswanath) 19 ఫిబ్రవరి 1930 లో జన్మించారు. దర్శకుడిగా శంకరాభరణం, సాగర సంగమము వంటి అద్భుతమైన సినిమాలను అందించారు. ఆయన సినీ జీవితంలో అతి గొప్ప అవార్డులు పద్మ శ్రీ, దాదా సాహెబ్ ఫాల్కే అందుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు గొప్ప విజయాలను అందించిన విశ్వనాథ్ 2023 ఫిబ్రవరి 2న మరణించారు.
చంద్రమోహన్
చంద్రమోహన్(Chandra Mohan) సినిమా రంగంలో ఎన్నో విలక్షణమైన పాత్రలను నటించిన గొప్ప నటుడు. 1966 లో రంగుల రాట్నం చిత్రంతో ఆయన సినీ కెరీర్ మొదలైంది. హీరోగా, హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్, సహాయ నటుడిగా 932 చిత్రాల్లో ఎన్నో భిన్నమైన పాత్రల్లో నటించారు. చంద్రమోహన్ చివరి చిత్రం ఆక్షిజన్. హాస్య నటుడిగా ప్రేక్షకుల మదిలో చిరకాల ముద్ర వేసుకున్న చంద్రమోహన్ 2023 నవంబర్ 11 న మరణించారు.
జమున
తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖ కథానాయికగా గుర్తింపు పొందిన నటి జమున(Jamuna). పుట్టిల్లు సినిమాతో నటిగా తెరంగేట్రం చేశారు. తెలుగు, హిందీ పలు భాషల్లో 198 సినిమాల్లో నటించారు. 1964లో మూగ మనసులు చిత్రానికి సహాయ నటిగా ఫిలిం ఫెయిర్ అవార్డు అందుకున్నారు. జమున 2023 జనవరి 27న మరణించారు.
శరత్ బాబు
తెలుగు చిత్ర పరిశ్రమలో శరత్ బాబు(Sarath Babu) విలక్షణమైన నటుడు. ఈయన 50 ఏళ్ల సినీ జీవితంలో తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో 250 కి పైగా సినిమాల్లో నటించారు. 1973 లో రామరాజ్యం చిత్రంతో హీరోగా నట అరంగేట్రం చేశారు. 1981, 1988, 1989 సంవత్సరాల్లో వరుసగా మూడు సార్లు నంది పురస్కారాన్ని అందుకున్నారు. శరత్ బాబు 2023 లో మే 22 న అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు.
రాకేష్ మాస్టర్
రాకేష్ మాస్టర్(Rakesh Master) కెరీర్ మొదట్లో కొరియోగ్రాఫర్ గా మంచి గుర్తింపు పొందారు. సినిమా ఇండస్ట్రీలో రాకేష్ మాస్టర్ దాదాపు 300 పాటలకు కొరియోగ్రఫీ చేశారు. ఒకప్పుడు స్టార్ కొరియోగ్రాఫర్ గా పేరొందిన రాకేష్ మాస్టర్ కెరీర్ మధ్యలో అవకాశాలకు దూరమయ్యారు. రీసెంట్ గా 2023 జూన్ 18న గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
మనో బాల
మనోబాల(Manobala) నటుడు, దర్శకుడు, నిర్మాత, హాస్యనటుడు. మనోబాల హాస్య నటుడిగా ప్రజాదరణ పొందారు. చంద్రముఖి, అపరిచితుడు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. మనో బాల 35 ఏళ్ల సినీ జీవితంలో 450 కి పైగా చిత్రాల్లో నటించారు. ఈయన చివరిగా ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో జడ్జ్ పాత్రలో కనిపించారు. మనో బాల 2023 మే 3 న మరణించారు.
నందమూరి తారక రత్న
నందమూరి తారక రత్న (Nandamuri Taraka Ratna) సీనియర్ NTR మనవడు. తారక రత్న 2002 లో ఒకటో నంబర్ కుర్రాడు హీరోగా ఎంట్రీ ఇచ్చారు. హీరోగా తొలి పరిచయమైన ప్రారంభంలోనే 9 సినిమాలు సైన్ చేసి..వరల్డ్ రికార్డ్ సృష్టించారు. 2023లో తారక రత్న TDP ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాద యాత్రలో పాల్గొన్నారు. ఆ యాత్రలో సొమ్మసిల్లి పడిపోయిన తారక రత్న ఆ తర్వాత అస్వస్థతకు గురయ్యారు. గుండె సంబంధిత సమస్యతో 23 రోజుల పాటు చికిత్స పొందారు. పరిస్థితి విషమించడంతో ఫిబ్రవరి 18 న ఆయన తుది శ్వాస విడిచారు.
తమిళ నటుడు విజయ్ కాంత్
తమిళ నటుడు విజయ్ కాంత్(Vijayakanth) సినిమా రంగంలో గొప్ప నటుడిగా తనదైన ముద్ర వేసుకున్నారు. విజయ్ కాంత్ సినిమా ఇండస్ట్రీలో నటుడిగా మాత్రమే కాదు నిర్మాత, దర్శకుడుగా కూడా మంచి గుర్తింపు పొందారు. సినీ కెరీర్ ప్రారంభించిన మొదటి నుంచి కేవలం తమిళ సినిమాల్లోనే నటించిన తమిళ నటుల్లో ఈయన ఒకరు. దేశభక్తి, ద్విపాత్రాభినయం, పల్లెటూరి అబ్బాయి పాత్రలు పోషించడంలో విజయకాంత్ ప్రసిద్ధి చెందారు. విజయకాంత్ 40 ఏళ్ల సినీ జీవితంలో 100 కు పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకుల ఆదరణ పొందారు.
1986లో ‘అమ్మన్ కోవిల్ కిజకలే’ బెస్ట్ యాక్టర్ గా ఫిలిం ఫేర్ అవార్డు అందుకున్నారు. 1991 లో విజయ్ కాంత్ నటించిన “కెప్టెన్ ప్రభాకరన్” సినిమాతో ఆయనకు కెప్టెన్ అనే పేరు వచ్చింది. 2001 లో తమిళనాడు ప్రభుత్వం నుంచి తమిళనాడు రాష్ట్ర హైయస్ట్ సివిలియన్ అవార్డు కలైమనేని పురష్కారాన్ని అందుకున్నారు. సినిమాల నుంచి విరామం తీసుకున్న విజయ్ కాంత్ 2005 లో DMDK పార్టీనీ స్థాపించారు. తమిళనాడు శాసన సభలో 2011 నుంచి 2016 వరకు ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు చేపట్టారు. సినిమా, రాజకీయ రంగంలో రాణించిన విజయ్ కాంత్ కొంత కాలంగా అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన డిసెంబర్ 28 న కన్నుమూశారు.
Also Read: Y.S Sharmila Son Marriage : ‘అందులో నిజం లేదు..’ క్లారిటీ ఇచ్చిన చట్నీస్!