‘ఆపండి!’… దాదాపు పాత తెలుగు సినిమాలన్నిట్లో వినిపించే డైలాగ్ ఇది. హీరోయిన్ పెళ్లి పీటల మీద కూర్చుని ఉండగా, పెళ్లికొడుకు తాళికట్టే ఒక్క సెకను ముందు హీరోయిన్ ప్రియుడో, పోలీసులో, స్నేహితులో, మరొకరో వచ్చి పెళ్లి ఆపడాన్ని ఎన్నో సినిమాల్లో చూశాం. అయితే, ఈ సంఘటన అంతకు మించి!
తాళి కట్టు శుభవేళ… అని గాల్లో తేలిపోతూ పెళ్లికొడుకు మూడు ముళ్లూ వేయడానికి రెడీ అయిపోతుండగా, అప్పటిదాకా పీటల మీదే ఉన్న వధువు ఒక్కసారిగా లేచి తనకా పెళ్లి వద్దంటే వద్దని తేల్చేసింది. అప్పటిదాకా సిగ్గులొలకబోసిన పెళ్లికూతురు ఒక్కసారిగా షాకివ్వడంతో బంధువులంతా అవాక్కయ్యారు. బాజాభజంత్రీలు ఆగిపోయాయి.. వరుడి ముఖం చిన్నబోయింది. విషయమేంటని గట్టిగా నిలదీస్తే పెళ్లికొడుక్కు నత్తి ఉందని, పెద్దగా చదువుకోలేదని చెప్పిందట ఆ అమ్మాయి. వనపర్తి జిల్లా కొత్తకోటలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.