రాజస్థాన్ లో దారుణం చోటు చేసుకుంది. వ్యాధిని నయం చేస్తానంటూ మాయ మాటలు చెప్పి బాలికపై ఓ తాంత్రికుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక గర్బం దాల్చింది. ఆ తర్వాత అవకాశం చూసుకుని అతని అనుచరులు కూడా బాలికపై పలు మార్లు అత్యాచారం చేశారు. అనంతరం ఓ పాపకు ఆమె జన్మనిచ్చింది. కానీ ప్రసవ సమయంలో ఆమె మైనర్ అనే విషయం బయటకు రావడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం….
సాలుంబర్ జిల్లాకు చెందిన బాలిక పదవ తరగతి చదువుతోంది. కొంత కాలం క్రితం బాలిక అస్వస్థకు గురైంది. దీంతో ఆమెను తన దగ్గరకు తీసుకు వస్తే బాలిక వ్యాధిని నయం చేస్తానని ఆమె తండ్రిని తాంత్రికుడు నమ్మించాడు. అనంతరం మాయ మాటలు చెప్పి బాలికపై అత్యారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత బాలిక గర్భం దాల్చింది. కొన్ని నెలల తర్వాత ఆస్పత్రిలో ఓ పాపకు బాలిక జన్మనిచ్చింది.
కానీ ఆమె మైనర్ అన్న విషయం గుర్తించిన ఆస్పత్రి వైద్యులు సమాచారాన్ని పోలీసులకు అందించారు. దీంతో పోలీసులు ఆమె నుంచి స్టేట్ మెంట్ తీసుకున్నారు. కానీ ఎలాంటి కేసు నమోదు చేయలేదు. విషయం బయటకు వస్తే ఎక్కడ తమ పరువు పోతుందోనన్న భయంతో మొదట్లో బాలిక తల్లిదండ్రులు భయపడ్డారు. కానీ ఆ తర్వాత గత నెల 6న బాలిక కుటుంబ సభ్యులు ఉన్నతాధికారులకు మరోసారి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ఘటనకు సంబంధించి తాంత్రికునితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ఇద్దరు నిందితులు ఆస్పత్రిలో పార్కింగ్ ఏరియాలో పని చేస్తుంటారని చెప్పారు. నిందితుల్లో ఒక బాలుడు వున్నట్టు తెలిపారు. నిందితుల నుంచి డీఎన్ఏ నమూనాలను సేకరించామని తెలిపారు. ఆ నివేదికలు వచ్చాక న్యాయస్థానానికి వాటిని అందజేస్తామన్నారు.