Hyderabad Police: హైదరాబాద్ నగరంలో నైట్ కల్చర్ పెరగడంతో క్రైమ్ రేటు పెరిగిపోయిందని..దీని గురించి ప్రభుత్వం చర్యలు చేపట్టి కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే రాత్రి 10.30 నుంచి 11 మధ్యలోనే అన్ని దుకాణాలను మూసివేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని ఓ వార్త నిన్నటి నుంచి నెట్టింట చక్కర్లు కొడుతోంది.
రాత్రి ఆ టైమ్ దాటిన తరువాత షాప్ లో ఓపెన్ చేసి ఉంటే అధికారులు చర్యలు తీసుకుంటారని సోషల్ మీడియాలో పోస్టులు ప్రత్యక్షమవుతున్నాయి. దీనిపై హైదరాబాద్ సిటీ పోలీసులు స్పందించారు. ఆ వార్తల్లో నిజం లేదని తేల్చేశారు. హైదరాబాద్ లో రాత్రి 10.30 లేదా 11 గంటలకే షాపులను మూసివేస్తున్నారనేది పూర్తిగా అబద్దమని అన్నారు.
సోషల్ మీడియాలో సిటీ పోలీసులు రాత్రి 10.30 లేదా 11 గంటలకే షాపులను మూసివేస్తున్నారని వస్తున్న వార్తలు పూర్తిగా తప్పుదారి పట్టించేవి.
దుకాణాలు మరియు సంస్థలు తెరియు మరియు మూసి వేయు సమయములు ప్రస్తుత నిబంధనల ప్రకారమే కొనసాగును.
ఇది అందరూ గమనించగలరు.
— Hyderabad City Police (@hydcitypolice) June 24, 2024
నగరంలో దుకాణాలు, సంస్థలు తెరవడం, మూసివేసే టైమింగ్స్ ప్రస్తుత నిబంధనల ప్రకారమే కొనసాగుతాయని తెలిపారు. నగర వాసులు ఈ విషయాన్ని గమనించాలని హైదరాబాద్ సిటీ పోలీసులు తమ ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. నగరంలో ఎలాంటి కొత్త రూల్స్ ప్రవేశపెట్టలేదని స్పష్టత ఇచ్చారు.
అర్ధరాత్రి నగరంలో మార్కెట్ బాగానే జరుగుతుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో తమ బతుకుదెరువు ఎలా అని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ సిటీలో రాత్రి పూట షాపింగ్ చేసే వారికి సైతం ఇది షాకింగ్ న్యూసే అంటూ ప్రచారం జరగడంతో.. అవన్నీ వదంతులేనని సిటీ పోలీసులు పేర్కొన్నారు. ప్రజలు ఇలాంటి వదంతులు నమ్మోద్దని.. ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన, ఎవరైనా అధికారి, పోలీసులు ప్రకటన విడుదల చేస్తేనే నమ్మాలని నగర ప్రజలకు పోలీసులు తెలిపారు.
బ్యాచిలర్స్ కు రాత్రిపూట కచ్చితంగా ఆహారం దొరుకుతుంది, ఇక ఏ ఇబ్బంది లేదంటూ పోలీసుల పోస్టుపై యువత స్పందిస్తున్నారు. క్రైమ్ రేటు పెరగడానికి రాత్రివేళ షాపులు, సంస్థలు తెరుచుకుని ఉండటానికి ఏ సంబంధం లేదని కామెంట్లు పెడుతున్నారు.