ఎగ్మోర్ కోర్టులో గట్టి ఎదురుదెబ్బ..
6 months Jail for Jayaprada: మాజీ ఎంపీ, అలనాటి నటి జయప్రదకు ఎగ్మోర్ కోర్టులో (Egmore Court) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తన థియేటర్లో పనిచేసిన కార్మికులకు చెందిన సొమ్మును ఎగ్గొట్టిన కేసులో ఆమెకు ఆరు నెలల జైలు శిక్ష పడింది పడింది. చెన్నైలోని రాయపేటలో జయప్రదకు ఉన్న సినిమా థియేటర్‌ను రామ్ కుమార్, రాజబాబుతో కలిసి నడిపించారు. అయితే ఈ సినిమా థియేటర్లో పని చేస్తున్న కార్మికుల నుంచి ఈఎస్ఐ మొత్తాన్ని లేబర్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌కు చెల్లించకుండా ఎగ్గొట్టారు. దీనిపై కార్మికులతో పాటు లేబర్ కార్పొరేషన్ అధికారులు ఎగ్మోర్ కోర్టును ఆశ్రయించారు.
6నెలల జైలు శిక్ష.. రూ.5వేలు జరిమానా..
కేసు విచారణ సందర్భంగా కార్మికులకు చెల్లించాల్సిన మొత్తాన్నిసెటిల్ చేసుకుంటామని, ఆ మొత్తం వెంటనే చెల్లించేందుకు సిద్ధమని జయప్రద తరఫున న్యాయవాది విజ్ఞప్తిచేశారు. దీనికి లేబర్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ న్యాయవాది అభ్యంతరం తెలిపారు. దీంతో న్యాయమూర్తి జయప్రదతో పాటు మరో ముగ్గురికి ఆరు నెలల జైలు శిక్ష, ఒక్కొక్కరికీ రూ.5 వేల జరిమానా విధించిస్తూ తుది తీర్పు ఇచ్చారు.
స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు..
ఎనభై, తొంభై దశకాల్లో స్టార్ హీరోయిన్గా జయప్రద ఓ వెలుగు వెలిగారు. అనంతరం నటి నుంచి నాయకురాలిగా మారిన ఆమె.. 1994లో టీడీపీలో చేరి రాజ్యసభ సభ్యురాలిగా పనిచేశారు. తర్వాత సమాజ్‌వాదీ పార్టీలో చేరి రాంపూర్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచారు. అయితే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఆమెను పార్టీ నుంచి బహిష్కరించారు. ఆ తర్వాత ఆమె సొంత పార్టీ పెట్టినప్పటికీ సక్సెస్ కాలేకపోయారు. దీంతో ఆర్ఎల్డీలో చేరి, ఉత్తర్ ప్రదేశ్‌లోని బింజోర్ సీటు బరిలోకి దిగి ఓడిపోయారు. 2019లో బీజేపీ కండువా కప్పుకున్న ఆమె రాంపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దాదాపు రెండు దశాబ్ధాల సినీ కెరీర్లో తెలుగు, హిందీ, కన్నడ, తమిళం, బెంగాలీ, మలయాళం భాషల్లో ఆమె 280పైగా చిత్రాల్లో నటించారు.
Also Read: వైజాగ్ లో పవన్ కళ్యాణ్ ‘వారాహి యాత్ర’ ఫైనల్ షెడ్యూల్ ఇదే!!