Sengol Controversy: పార్లమెంట్ లో రాజదండం(సెంగోల్) ఉంచడంపై మళ్ళీ దుమారం రేగుతోంది. ఇటీవల సమాజ్ వాది పార్టీ సభ్యుడు ఆర్కే చౌదరి చేసిన వ్యాఖ్యలు దీనికి కారణం అయ్యాయి. పార్లమెంటు నుంచి రాజదండం తొలగించాలంటూ ఆయన రాసిన లేఖకు బీజేపీ బదులిచ్చింది. ఇది రాచరికానికి ప్రతీక అయితే మొదటి ప్రధాని నెహ్రూ ఎందుకు అంగీకరించారని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా అన్నారు. తాత్కాలిక స్పీకర్ భర్తిహరి మహతాబ్‌కు రాసిన లేఖలో, RK చౌదరి సెంగోల్ ప్రజాస్వామ్య భారతదేశంలో రాచరికానికి సంబంధించిన అనాచార చిహ్నంగా పేర్కొన్నారు. రాచరికం అంతమై, దేశం విడిపోయిందని, అందుకే రాజదండం అవసరం లేదని, రాజ్యాంగాన్ని కాపాడాలని, రాజదండాన్ని తొలగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అంతే కాదు, ఆ స్థలంలో రాజ్యాంగ బృహత్తర విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు.
అసలు ఏమిటీ సెంగోల్? ఇది పార్లమెంట్ లో ఎందుకు ఉంది?
Sengol Controversy: 1947 ఆగస్ట్‌లో అధికార అప్పగింతకు ప్రతీకగా మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూకి ఇచ్చిన ఉత్సవ రాజదండం (సెంగోల్) అలహాబాద్ మ్యూజియంలోని నెహ్రూ గ్యాలరీలో ఉంచారు. దీనిని అక్కడ నుంచి కొత్త పార్లమెంటు భవనంలో ప్రతిష్టించడానికి ఢిల్లీకి తీసుకువచ్చారు. మే 28, 2023న, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాంప్రదాయ పూజలు చేసిన తర్వాత, కొత్త పార్లమెంట్ భవనంలో స్పీకర్ కుర్చీ పక్కన, లోక్‌సభ ఛాంబర్లో దీనిని ఏర్పాటు చేశారు. ఆ సమయంలోనే దీనిపై చాలా వివాదం రేగింది. కాంగ్రెస్ సహా విపక్షాలు దీనిని తప్పుపడుతూ ప్రభుత్వాన్ని.. మోడీని విమర్సించారు.
Sengol Controversy: అంతకు ముందు మే 24న కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధికారికంగా ధృవీకరించిన రిపోర్ట్స్ ప్రకారం, తమిళ చరిత్రలో ఈ ప్రత్యేకమైన సెంగోల్ “1947లో బ్రిటిష్ వారి నుండి భారతదేశానికి అధికార మార్పిడికి ప్రతీక”. ఆ సమయంలో మీడియాతో షా మీడియాతో మాట్లాడుతూ, బ్రిటిష్ వారి నుండి అధికార బదిలీని సూచించడానికి నెహ్రూ అందుకున్న తమిళనాడు కు చెందిన చారిత్రక రాజదండం, అలహాబాద్‌లోని మ్యూజియంలో ఉంచారు. దీనిని ప్రధాని మోడీ ప్రారంభించబోయే కొత్త పార్లమెంటు భవనంలో ఏర్పాటు న్నామని తెలిపారు. తమిళనాడుకు చెందిన తిరువావడుతురై ఆదీనం ప్రకారం, కొత్త పార్లమెంటు భవనంలో సెంగోల్‌ను ఏర్పాటు చేయడం తమిళనాడుకు గర్వకారణం. తిరువావడుతురై ఆదీనం అంబలవాన దేశిక పరమాచార్య స్వామి, భారతదేశ చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ 1947లో నెహ్రూకు ఈ సెంగోల్ ఇచ్చారని చెప్పారు.
Sengol Controversy: అయితే, కాంగ్రెస్ మాత్రం విభిన్నంగా స్పందించింది. ఆ సమయంలో తమిళనాడులో ఎన్నికలు జరుగుతున్నందున దక్షిణాదిలో పాగా వేయడం కోసం ఇదొక సాకుగా తీసుకున్నారని కాంగ్రెస్ నాయకులూ విమర్శలు చేశారు. బీజేపీ కట్టుకథలు చెబుతోందని చెబుతూ.. ఇదంతా పొలిటికల్ డ్రామా అని కొట్టిపడేసింది. అంతేకాకుండా రాజదండం విషయంలో బీజీపీది అంతా మాటల గారడీ అంటూ తీవ్రంగా విమర్శించింది. ఇన్ని విమర్శల మధ్య పార్లమెంట్ లో రాజదండం ఉంచారు.
ఇప్పుడేమవుతోంది?
ఇప్పుడు సమాజ్ వాదీ పార్టీ దీనిని మళ్ళీ వివాదాలకు కేంద్ర బిందువుగా చేసింది. ఒకపక్క బీజేపీ దీనిని తమిళనాడు సంస్కృతికి ప్రతీక అని చెబుతుంటే.. అది సరైనది కాదు అంటూ.. సమాజ్ వాదీ పార్టీ దానిని అక్కడ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తోంది. సహజంగానే కాంగ్రెస్ కూడా ఆ డిమాండ్ ను సమర్ధిస్తోంది. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ చౌదరిని సమర్థించారు. ఈ వ్యాఖ్య ప్రధానమంత్రికి రిమైండర్ కావచ్చునని సూచించారు. “సెంగోల్‌ను ఏర్పాటు చేసినప్పుడు, ప్రధానమంత్రి దాని ముందు వంగి నమస్కరించారు. ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఆయన ఈ విషయాన్ని మరచిపోయి ఉండవచ్చు. బహుశా మా ఎంపీ చేసిన వ్యాఖ్య అతనికి గుర్తు చేసేలా ఉండవచ్చు” అని యాదవ్ పేర్కొన్నారు.
మొత్తమ్మీద రాజదండము పార్లమెంట్ లో అమరచడంపై మరో వివాదం స్టార్ట్ అయింది. ఇది ఎటుతిరిగి ఎటువైపు టర్న్ తీసుకుంటుందనేది ఆసక్తి కరంగా ఉంది.