Sidharth Luthra: స్కీల్ డెవలెప్మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు తరపున వాదనలు వినిపిస్తున్న సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ సిద్ధార్ధ్ లూథ్రా చేసిన ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. అన్ని ప్రయత్నాలు చేసినా న్యాయం కనుచూపు మేరలో కనిపించనప్పుడు కత్తి పట్టడం సరైన చర్య అవుతుందంటూ పోస్ట్ చేశారు. పంజాబీల గురువు గురు గోబింద్ సింగ్ అప్పటి మొఘుల్ చక్రవర్తి ఔరంగజేబ్‌ను ఉద్దేశించి రాసిన జఫర్‌నామాలో ఈ మాటలున్నాయి. దీనికి సంబంధించి ఉర్దూలో గురుగోబింద్ సింగ్ ప్రస్తావించిన మాటల ఫొటోను ఆయన ట్యాగ్ చేశారు. ఏసీబీ కోర్టులో రిమాండ్ అవసరం లేదని లూథ్రా ఎంత వాదించినా న్యాయమూర్తి రిమాండ్ విధించిన నేపథ్యంలో లూథ్రా ఇలాంటి ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
Motto for the day pic.twitter.com/gh0VsVYm8G
— Sidharth Luthra (@Luthra_Sidharth) September 13, 2023
అంతకుముందు కూడా ఏసీబీ కోర్టులో వాదనలు కోసం వచ్చిన ఆయన.. “ఏపీ మాజీ సీఎం చంద్రబాబు కేసులో వాదించడం కోసం శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి విజయవాడలో వేచి ఉన్నాను. ఈ న్యాయవాద వృత్తిలో ఎప్పుడూ నిస్తేజంగా ఉండకూడదు!” అని ట్వీట్ చేశారు.
Waiting in Vijayawada since 4 pm yesterday for production of former AP CM. Never a dull moment in this profession of law!
— Sidharth Luthra (@Luthra_Sidharth) September 10, 2023
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు (Chandrababu) దాఖలు చేసిన క్యాష్ పిటిషన్ (Quash Petition) మీద ఏపీ హైకోర్టులో ఈరోజు విచారణ జరిగిన విషయం తెలిసిందే. దీంతో పాటు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో (Amaravati Inner Ring Road Case) బెయిల్ మంజూరు కోసం హైకోర్టులో వేసిన పిటిషన్ మీద కూడా విచారణ జరిగింది. ఈ నెల19వ తేదీకి క్వాష్ పిటిషన్ విచారణను కోర్టు వాయిదా వేసింది. దాంతో పాటూ ఈ నెల 18వరకు సీఐడీ (CID) వేసిన పిటిషన్స్ పై కూడా ఎలాంటి విచారణ చేయవద్దని ఏసీబీ కోర్టును ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. అలాగే పిటిషన్‌పై విచారణ సందర్భంగా సీఐడీ కస్టడీకి ఇవ్వద్దని ఏపీ హైకోర్టు (AP High Court)ను విజ్ఞప్తి చేశారు చంద్రబాబు లాయర్లు. దీనిపై స్పందించిన కోర్టు సోమవారం వరకు కస్టడీకి ఇవ్వొద్దని ఆదేశించింది. ఈ పిటిషన్‌పై పూర్తి వాదనలు ఇంకా వినాల్సి ఉందని హైకోర్టు తెలిపింది. కేసుకు సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని హైకోర్టు ఆదేశించింది.
రాజకీయ కుట్రలో భాగమే..
స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు రిమాండ్ రిపోర్టును సవాల్ చేస్తూ హైకోర్టులో లాయర్ దమ్మాలపాటి శ్రీనివాస్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబును ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ గురించి చంద్రబాబు తరఫు న్యాయవాది శ్రీనివాస్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈనెల 18 వరకు ఎలాంటి విచారణ చేపట్టవద్దని ఆదేశించింది. స్కిల్ స్కాం కేసులో ఎఫ్ఐఆర్లో తన పేరు లేకుండానే అరెస్ట్ చేశారని చంద్రబాబు క్వాష్ పిటిషన్లో ఆరోపించారు. అంతేకాదు రిమాండ్ రిపోర్ట్‌లో పెట్టిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ఇదంతా రాజకీయ కుట్రలో భాగంగానే.. తనను తప్పుడు కేసులో ఇరికించారని టీడీపీ అధినేత పేర్కొన్నారు.
Also Read: చంద్రబాబుతో ముగ్గురూ ఒకేసారి ములాఖత్