7/G Brundavan Colony Sequel: 1990ల్లో పుట్టిన వారికి 7/జీ బృందావనం సినిమా అంటే ఓ ఫీలింగ్.. ఓ ఎమోషన్. తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో సరికొత్త ట్రెండ్ సృష్టించిన సినిమా ఇది. తమిళంతో పాటు తెలుగులో విడుదలైన ఈ మూవీ అప్పటి యూత్‌ను ఓ ఊపు ఊపేసింది. ఈ సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటించిన రవికృష్ణ, సోనియా ఆగర్వాల్ నటనకు అందరూ ఫిదా అయిపోయారు. మూవీలో రవి చెప్పై డైలాగ్స్, హీరోయిన్‌తో లవ్ సీన్స్, తండ్రి సెంటిమెంట్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఇక పాటల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యువన్ శంకర్ రాజా ఇచ్చిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇప్పటికీ చెవుల్లో మార్మోగుతూనే ఉంటాయి. ముఖ్యంగా కన్ను బాసలు తెలియవలే, తలచి తలచి చూశా, మేం వయసుకు వచ్చాం పాటలకు అయితే సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు.
హీరోయిన్గా అనస్వర రాజన్ ఎంపిక!
అంతగా ట్రెండ్ సెట్ చేసిన 7/జీ బృందావనం సినిమాకు 20 ఏళ్ల తర్వాత సీక్వెల్ వస్తుందని తెలియడంతో మూవీ లవర్స్ సంతోషం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఈ సీక్వెల్ మూవీలో హీరోయిన్ ఖరారు అయినట్లు తెలుస్తోంది. సీక్వెల్ మూవీలోనూ రవినే హీరోగా నటించనున్నాడు. ఇక హీరోయిన్గా ఇవానా, అతిథి శంకర్ పేర్లు తెరపైకి వచ్చినా చివరకు మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ ఎంపికైనట్లు తెలుస్తోంది. అయితే దీనిపై మూవీ యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినిమాల్లోకి వచ్చిన ఈ భామ హిందీ, తమిళ సినిమాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల త్రిష నటించిన ‘రాంగీ’ చిత్రంలో కూడా నటించింది.
సెప్టెంబర్ 22న రీ రిలీజ్..
2004లో తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. రవికృష్ణ, సోనియా అగర్వాల్ కెరీర్లో ఈ చిత్రం ఓ మైలురాయిగా నిలిచిపోయింది. ఇక సీనియర్ నటులు చంద్రమోహన్, విజయన్, సుమన్ శెట్టి, సుధ, మనోరమ ఇతర కీలక పాత్రల్లో నటించారు. సూర్య మూవీస్ పతాకంపై ఏఎం రత్నం ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీ విడుదలై 20 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా సెప్టెంబర్ 22న రీ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఈ మూవీని థియేటర్లలో మరొకసారి చూసి అలరించడానికి ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. అప్పటి యూత్‌తో పాటు ఫ్యామిలీ అభిమానులను ఎంతగానో అలరించిన ఈ మూవీ సీక్వెల్.. హిస్టరీ రిపీట్ చేసి రికార్డులు సృష్టిస్తుందో లేదో వేచి చూడాలి.