Youngest Mp: 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి దేశ వ్యాప్తంగా మంగళవారం ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో ఎన్డీఏ విజయం సాధించగా.. కాంగ్రెస్ బలమైన ప్రతిపక్షంగా మరోసారి నిలిచింది. కాగా.. ఈ ఎన్నికల్లో ముఖ్యమైన వారు కొందరు ఓటమిపాలైతే.. మరికొందరు తొలిసారిగా పార్లమెంట్ లో అడుగుపెట్టబోతున్నారు. వారిలో అతి పిన్న వయసు వారు కూడా చాలా మంది ఉన్నారు.
వారిలో కాంగ్రెస్ ఎంపీ సంజనా జాతవ్ ఒకరు. ఈమె భారత్ లోనే అతిపిన్న వయస్సు గల ఎంపీ. రాజస్థాన్లోని భరత్పూర్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరుఫున పోటీ చేసి విజయాన్ని అందుకుంది. సంజనా జాతవ్ వయస్సు (25). జాతవ్ 51,983 ఓట్లతో బీజేపీ అభ్యర్థి రాంస్వరూప్ కోలీపై గెలిచారు.
సంజనా జాతవ్ (25) దళిత వర్గానికి చెందిన అభ్యర్థి. 18వ లోక్సభకు ఎన్నికైన అతి పిన్న వయస్కురాలైన పార్లమెంటు సభ్యులలో ఒకరు. జాతవ్ రాజస్థాన్లో పనిచేస్తున్న పోలీస్ కానిస్టేబుల్ కప్తాన్ సింగ్ను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. ఎన్నికల కమిషన్కు సమర్పించిన అఫిడవిట్లో జాతవ్ మొత్తం ఆస్తుల విలువ రూ. 23 లక్షలు.. అప్పులు రూ. 7 లక్షలుగా ఉన్నట్లు ఎన్నికల అధికారులకు తెలిపారు.
2023 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలలో జాతవ్ 409 ఓట్ల స్వల్ప తేడాతో బీజేపీ అభ్యర్థి రమేష్ ఖేడి చేతిలో పరాజయం పాలయ్యారు. అయితే ఓటమి గురించి పట్టించుకోని ఆమె… లోక్సభ ఎన్నికల కోసం ఉత్సాహంగా ప్రచారం నిర్వహించింది. 2019 ఎన్నికలలో ఖాతా తెరవడంలో విఫలమైన కాంగ్రెస్ పార్టీకి ఈ సారి చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది.