క్రికెట్ లో టీమిండియాని అత్యున్నత స్థాయికి చేర్చి, కెప్టెన్ గా ఎన్నో విజయాలు అందించాడు మహేంద్ర సింగ్ ధోనీ. ప్రస్తుతం రిటైర్మెంట్ అనంతరం ఐపీఎల్ ఆడుతూనే తన సెకండ్ ఇన్నింగ్స్ ని సినిమాల్లో స్టార్ట్ చేశాడు. ఇటీవలే ధోనీ ‘ధోనీ ఎంటర్టైన్ మెంట్స్ నిర్మాణ సంస్థ’ని స్థాపించి సినిమాలని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. నిర్మాతగా తన మొదటి సినిమా తమిళ్ లో నిర్మించాడు. హరీష్ కళ్యాణ్, ఇవానా జంటగా నదియా, యోగిబాబు ముఖ్య పాత్రల్లో నటించిన ‘LGM’ (లెట్స్ గెట్ మ్యారీడ్) అనే సినిమాకి నిర్మాతగా వ్యవహరించాడు. ఈ చిత్రానికి రమేష్ దర్శకత్వం వహించారు. ధోని భార్య సాక్షి సింగ్ ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు చూసుకుంది. ఈ సినిమాని తెలుగులో కూడా డబ్బింగ్ చేసి రిలీజ్ చేయనున్నారు.
ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. చెన్నైలోని ఓ థియేటర్ లో సినిమా యూనిట్ తో కలిసి మహీ భార్య సాక్షి సింగ్ సందడి చేసింది. ఈ క్రమంలో మీడియా అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పింది. సాక్షి మాట్లాడుతూ.. ధోనీకి తమిళ్ ఫ్యాన్స్ అంటే ఎంతో ఇష్టం.. తమిళనాడుని తన సొంత రాష్ట్రంగా భావిస్తాడని తెలిపింది. ప్రస్తుతం ధోని గాయం నుంచి కోలుకుంటున్నాడని చెప్పుకొచ్చింది. ధోనీ హీరోగా ఎంట్రీ ఇస్తారా? అన్న ప్రశ్నకు.. ఆన్సర్ చేస్తూ.. మహీకి నటన కొత్తేమీ కాదు.. ఆయన హీరోగా రావాలని నేను కూడా చూస్తున్నా.. ఇప్పటికే అనే యాడ్స్ లో నటించాడు. ఆయనకి కెమెరా ఫియర్ లేదు.. మంచి స్క్రిప్ట్ దొరికితే ధోనీ హీరోగా నటించడానికి కూడా రెడీగా ఉన్నాడు అంటూ తెలిపింది.
అలాగే తన అత్త గురించి అడిగిన ప్రశ్నలకు సాక్షి ఆసక్తికర సమాధానాలు ఇచ్చింది. ధోనీ తల్లి తనతో చాలా స్నేహంగా ఉంటారని తెలిపింది. ‘మా పెళ్లికి ఒక్క రోజు ముందే మా అత్తగారిని కలిశా.. మేమిద్దరం చాలా స్నేహంగా ఉంటాం.. ఆమె నన్ను చాలా సపోర్ట్ చేస్తుంది. ఎంతో సరదాగా ఉంటుంది. ఇంట్లో మా మావయ్యే చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. అందుకే ధోనీలో అంత క్రమశిక్షణ ఉంది’అని చెప్పుకొచ్చింది .
తెలుగులో సినిమాలని ప్రొడ్యూస్ చేస్తారా అన్న ప్రశ్నకు.. తెలుగులో ప్రభాస్, రామ్ చరణ్ లాంటి బడా హీరోలతో సినిమా తీయాలంటే వారికి భారీ పారితోషికం ఇవ్వాల్సి ఉంటుందని, అంత బడ్జెట్ తమ దగ్గర లేదని, తమ కంపెనీని ఇప్పుడే మొదలు పెట్టి.. నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పుకొచ్చింది సాక్షి సింగ్. ఇక మహేంద్ర సింగ్ ధోనీ ప్రొడ్యూస్ చేసిన ‘ఎల్ జీఎం’ సినిమాకి యావరేజ్ రేటింగ్ వచ్చింది.